హాజరైన 15 ప్రతిపక్షాల నేతలు
పోరు రెండు సిద్ధాంతాల మధ్య తప్ప వ్యక్తుల మధ్య కాదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షా ల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖ లు చేశారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ పోటీ రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్న పోరుగా యశ్వంత్ మద్దతుదారాలు అభివర్ణించారు. కాగా, 84 ఏళ్ల యశ్వంత్ సిన్హా తన భార్య నీలిమా, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కెటి రామారావు సహా దాదాపు 15 ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, 16వ రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన పిసి మోడీకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే సిన్హా పేరును ప్రతిపాదించగా, రెండవ సెట్ నామినేషన్ పత్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ బలపరిచారు. మిగతా రెండు సెట్ల నామినేషన్ పత్రాల్లో డిఎంకె సుప్రీం, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్‌లు సిన్హా పేరును ప్రతిపాదించారు. ప్రతి నామినేమిషన్ సెట్‌లో 60 మంది ప్రతిపాదకులు సంతకాలు చేయగా, మరో 60 మంది బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హా రూ. 15 వేల నగదును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. యశ్వంత్ నామినేషన్ వేయడాని కొన్ని గంటల ముందు టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆయనకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రావు కుమారుడు, రాష్ట్రమంత్రి అయిన కెటి రామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం సిన్హాకు మద్దతుగా నిలిచింది. అయితే సిన్హా అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) సిన్హా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఎన్‌డిఎ అభ్యర్థి ముర్ముకు గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు మద్దతు పలికింది. అదే విధంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో శివసేన నుంచి కూడా ఎవరూ హాజరు కాలేదు. నామినేషన్ దాఖలు అనంతరం సిన్హా, ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు. అనంతరం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. అత్యున్నత రాజ్యాంగ పదవి కోసం సిన్హా అభ్యర్థిత్వానికి ప్రతిపక్ష పార్టీలంతా ఉమ్మడిగా మద్దతు తెలుపుతున్నాయన్నారు. అదే విధంగా వ్యక్తిగంతగా కూడా మద్దతు తెలుపుతున్నామని, అయితే నిజమైన పోరాటం రెండు సిద్ధాంతాలకు మధ్యేనన్నారు. కోపం, ద్వేషపూరిత ఆర్‌ఎస్‌ఎస్ ఒకవైపు కాగా, దయాభావం కలిగిన ప్రతిపక్ష పార్టీలు మరోవైపు అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. రాజ్యంగంలో పొందుపరిచిన విలువలు కాపాడేందుకు సిన్హా ఉత్తమమమైన అభ్యర్థి అని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత రాయ్ అభివర్ణించారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగతున్న పోరు మాత్రమే కాదని, మతతత్వం లౌకికతత్వం, నిరంకుశత్వం ప్రజాస్వామ్యం మధ్య జరుగుతున్న పోరు అని ఆయన చెప్పారు. సిన్హా మాజీ ఐఎఎస్ అధికారే కాకుండా కేంద్ర మాజీ మంత్రు కూడా అని రాయ్ గుర్తు చేశారు. ఇద్దరు వ్యక్తులను పోల్చితే సిన్హా ఉత్తమమైన వ్యక్తి అని అన్నారు. అతనికి ప్రతిపక్షాల పూర్తి మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్, డిఎంకె, సోషలిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా సిన్హాకు మద్దతు పలికాయని రాయ్ వెల్లడించారు. రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఈ పోటీ గుర్తింపు రాజకీయాలకు సంబంధించినది కాదని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ద్రౌపతి ముర్ము అంటే గౌరవం ఉన్నప్పటికీ సిద్ధాంతాలు మధ్యే అసలైన పోటీ అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, యశ్వంత్ సిన్హా మంగళవారం నాడు కేరళ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించే అవకాశముంది. ఆ తరువాత తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లో కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. పవార్, రాహుల్‌గాంధీ, ఖర్గే, జైరామ్‌రామ్ రమేష్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్, టిఎంసి నేతలు అభిషేక్ బెనర్జీ, సౌగతరాయ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, డిఎంకెకు చెందిన తిరుచి శివ, ఎ. రాజా, జమ్ముకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ(ఎం) నేత సీతారాం ఏచూరి సహా ప్రతిపక్షాలకు చెందిన అగ్ర నాయకులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే విధంగా రాష్ట్రీయ లోక్ దళ్‌కు చెందిన జయంత్ చౌదరి, రాష్ట్రీయ జనతా దళ్‌కు నేత మిసా భారతి, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ బషీర్, ఎన్‌సిపికి నాయకుడు ప్రఫూల్ పటేల్ కూడా సిన్హాతో పాటు ఉన్నారు. ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము గత వారమే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సిన్హాకు ఎంఐఎం మద్దతు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు బలపరిచిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేసి మద్దతు కోరారని, ఎంఐఎం ఎంఎల్‌ఏలు , ఎంపిలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వనునన్నట్లు ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎంఐఎంకు రెండు ఎంపి, 14 ఎంఎల్‌ఎ స్థానాలు ఉన్నాయి.