జన జీవనం అస్తవ్యస్తం
మహోగ్రరూపం దాల్చిన గోదావర
ద్వీపకల్పంగా మారిన భద్రాచలం పట్టణం
అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం జల దిగ్భంధమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వాన, వరదలతో బుధవారం అనేక గ్రామాలు, పపట్టణాలు, కాలనీలు, లోతట్టు ప్రాం తాలు నీట మునిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. వర్షాలు అధికంగా పడుతున్న అనేక జిల్లాలలో పల్లె, పట్టణమనే తేడా లేకుండా అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహింస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తి వరదనీటి ఇన్‌ఫ్లో పెద్దఎత్తున పెరుగుతుండడంతో గేట్లు ఎత్తివేసి అదే స్థాయిలో నాటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టుల పరివామక ప్రాంతాలు కాలనీలు, రోడ్లు జలమయమౌతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రవాణా వ్యవస్తకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాన, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు చర్యలు చేపట్టారు.
భద్రాచలం: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఉత్తర తెలంగాణలో పడుతున్న వానల కారణంగా నదికి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం గోదావరి ప్రవా హం మరోసారి 53 అడుగులు చేరుకోవడంతో 3వ ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరించింది. ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో వరద తాకిడి మరింతగా పెరిగింది. లక్ష్మీబ్యారేజీ నుండి 15,47,690 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ నుండి 15,62,600 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేశారు. అదే విధంగా తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత నదులు సైతం పెద్ద ఎత్తున పొంగి పొర్లుతూ గోదావరిలో కలుస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో సుమారు 100కు పైగా గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటికే వందలాది వరద సహయకశిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. భద్రాచలం పట్టణం మూడు వైపులా గోదావరి ముసుకు పోవడంతో ఊరు ద్వీపకల్పంగా మారి భద్రాచలం దాటి వెల్లేందుకు అవకాశం లేకుండాపోయింది. సమీపంలోని ఎటపాక, గుండాల ప్రధాన రహదారులు, బూర్గంపాడు రహదారి పూర్తిగా నీటిలో మునిగింది. పినపాక నియోజక వర్గంలోని పలు ప్రాంతాలను సైతం వరద ముంచెత్తుతోంది. గోదావరి వరద 64 అడుగులవరకు పెరిగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నీట మునిగిన మంచిర్యాల –
మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లాలో ఐదోరోజూ జోరు వర్షమే కురిసింది. గోదావరి వరద ప్రవాహానికి మంచిర్యాల ప్రాంతం నీట మునిగింది. ఎన్నడూ లేని విధంగా గోదావరి మహోగ్రరూపం దార్చడంతో అంచనాలకు మించి ప్రవహిస్తుండటంతో గోదావరి తీర ప్రాంత ప్రజలంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంచు కాలం వెళ్ళదీస్తున్నారు. మంచిర్యాలలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో రాళ్ళవాగు పోటుకమ్మి పట్టణంలోని రాంనగర్, ఎన్‌టిఆర్‌నగర్, ఎల్‌ఐసి కాలనీ, లక్ష్మినగర్‌లతో పాటు వాగు పరివాహాక కాలనీలన్ని నీటితో నిండిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ఇంటిలోని వస్తువులన్నింటిని వదిలేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైశ్యభవన్, కార్మిక సంఘ భవనం లాంటి వాటిలో తలదాచుకుంటున్నారు. మాత శిశు సంక్షేమ కేంద్రంలోకి మంగళవారం రాత్రి నుండి నీరు రావడంతో రాత్రికి రాత్రికి అందులో బాలింతలు, నవజాత శిశువులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేశారు. ప్రస్తుతం ఆసుపత్రి మొత్తం నీట మునిగింది. అత్యధికంగా కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా మామడ మండలంలో 16.24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ సమీపంలోని నాగాపూర్ వంతెనపై వరద పొంగిపొర్లడంతో ఆదిలాబాద్ -మంచిర్యాల మార్గంలో రవాణా స్తంభించింది. ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణిని ప్రసవం కోసం ఆదిలాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో వాగు పొంగిపొర్లడంతో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అతికష్టంమీద ఆమెను రిమ్స్‌కు తరలించారు.
నిర్మల్‌లో జలప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు
మోగిన కడెం ప్రాజెక్టు సైరన్& సిఎం ఫోన్
నిర్మల్ : భారీ వర్షాలు, వరదలు నిర్మల్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వస్తోంది. కడెం జలాశయానికి ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు వద్ద సైరన్ మోగించారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రాజెక్ట్ సమీపంలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నిర్మల్ పట్టణంలోని జిఎన్‌ఆర్ కాలనీ, సిద్దాపూర్, విజయ కాలనీ, కాల్వ గ్రామం, తాంసి, కడ్తాల్, కడెం మండలంలోని తదితర గ్రామాలు నీట మునిగిపోయాయి. దిలావర్‌పూర్ మండలంలోని ఆరు చెరువులు తెగిపోగా, నాలుగు ఇళ్లు కూలిపోయాయి. ఖానాపూర్ నిర్మల్ రహదారిలో దిమ్మదూర్తి గ్రామంలో బ్రిడ్జి కొట్టుకుపోవడంతో పాటు నిర్మల్ ఆదిలాబాద్ వెళ్లే రహదారిలో వాంకిడి గ్రామం పక్కన కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు చేరడంతో 4 గేట్లు ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పరివాహక ప్రాంతాల్లోని పెట్రోల్ బంక్లు, పలు కాలనీలు నీట మునిగాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.40 మీటర్ల నీరు చేరింది.
జనజీవనం అస్తవ్యస్తం
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని సదాశివనగర్, రాజంపేట్, బిక్కనూర్, గాంధారి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ తదితర మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురియడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువన కురుస్తున్న వర్షాలకు 10360 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, 17.802 టిఎంసిలకు గాను ప్రస్థుతం ప్రాజెక్టులో 1395 అడుగులు 7.398 టిఎంసిల నీరు నిల్వ ఉందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 34 గేట్ల ద్వారా 2 లక్షల 17 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 14వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,087 అడుగుల నీటిమట్టం, 75 టిఎంసిల నీటి నిల్వ ఉందని అధికారులు చెప్పారు.
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. అనంతరం రోడ్లపైకి.. ఆ తర్వాత దుకాణాల్లోకి వరదనీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వద్ద 12,10,600 క్యూసెక్కుల వరదనీరు వస్తోండగా 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం (సరస్వతి) బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 7,78,000 క్యూసెక్కులు.. అంతేస్థాయిలో ఔట్ ఫ్లో ఉంది. అక్కడ 65 గేట్లలో 62 పైకెత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద కూడా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వదర ఎక్కువగా వస్తుండటంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్తంభించిన జనజీవనం
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. నగరంలోని తోతట్టు ప్రాంతాల పరిస్థితి మరింత క్షీణించింది. ఇలాగే మరో రెండు రోజులు వర్షం పడితే నగరంలోని అనేక ప్రాంతాలు మరోసారి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో గత 24 గంటల్లో సరాసరి 54 మి.మీ. వర్షం పడింది. శాయంపేట, కాజీపేట, హనుమకొండ ఆత్మకూరు మండలాల్లో ఒక మోస్తరు భారీ వర్షాలు కురిశాయి. శాయంపేట మండలంలో వరుసగా ఆరో రోజు కూడా అధికవర్షం కురిసింది.అలాగే వరంగల్ జిల్లాలో 41.8 మి. మి సగటు వర్షపాతం నమోదైంది.
మురిగిపోతున్న పత్తి పంట
జనగామ: జనగామ జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. ప్రతి రోజు సగటు30 నుండి 35 సెంటీ మీటర్ల వర్షం పడరతుంది. జులై నెలలో 51.1సెంటీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటికే 217.71 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వాగులు పొంగి పొర్లుతూ చెరువులు నిండాయి. పలు చోట్ల మత్తడి పోస్తున్నాయి. బుధవారం సైతం జిల్లాలో 236 మిల్టీ మీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో లక్షా 80వేల ఎకరాలకు పైగా పత్తి పంట వేయగా, ఇందులో 40శాతం పంట నీట మునిగిమురిగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి మండలంలోని కోడూరు, రామన్నగూడెం, కంచెనపల్లి, లింగాలఘనపురం మండలంలోని కుందారం, చీటూరు, దేవరుప్పుల మండలంలోని కోటుకొండ, శాతపురం, కడవెండి, నర్మెట మండలంలోని మరియపురం తదితర గ్రామాల్లో ఎక్కువగా పత్తి పంట దెబ్బతిన్నట్లు సమాచారం.
రాష్ట్రం… జల దిగంధం
RELATED ARTICLES