పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే శ్రీశైలానికి చక్కనీరూ రాదు
విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది: రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు రాక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, దీంతో తెలంగాణ చీకటిమయం అవుతుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎపికి కేటాయించిన నీటినే తరలిస్తామని ఆ రాష్ట్ర సిఎం జగన్ చెబుతున్న మాటలను సిఎం కెసిఆర్ సమర్థిస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, వీటికి 6500 విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదన్నారు. విద్యుత్ వినియోగం ప్రకారం ప్రాజెక్టుల విభజన చేయాలని దివంగత నేత జైపాల్ రెడ్డి ఆనాడు సూచించారని, ఆనాడు 54 శాతం విద్యుత్ వినియోగం తెలంగాణలో ఉండేదని, ఆ ప్రకారమే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇచ్చారని గుర్తు చేశారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు వద్ద బొక్కపెట్టి జగన్ నీళ్లు తీసుకువెళతా అంటున్నారని, అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు రాదని చెప్పారు. తద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి కొత్త విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేస్తున్నారని, అందుకే పోతిరెడ్డిపాడు నుండి మరింత నీటి తరలింపునకు కెసిఆర్ అంగీకరిస్తున్నారని ఆరోపించారు.దీని వెనక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల లాబీయింగ్ ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు జగన్‌కు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియామకాలు కెసిఆర్ కుటుంబంలో చేసుకున్నారని అన్నారు. తెలంగాణ వల్ల ప్రజలకు ఏమీ రాలేదన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే విద్యుత్ ప్రాజెక్టులు సచ్చిపోతాయని, ఇది అపర మేధావి కెసిఆర్, బాల మేధావి కెటిఆర్‌కు తట్టడం లేదా? అని ప్రశ్నించారు. దీనిపై విద్యుత్‌రంగ నిపుణులు బయటకు వచ్చి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 2న ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలుపుతామని చెప్పారు. చంద్రబాబు చెప్పులు మోసింది, వైఎస్‌కు మూటలు మోసింది కూడా కెసిఆరేనని, అన్ని పార్టీలతో పొత్తులు పెట్టకున్నది కూడా ఆయనేనని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.