మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం కెసిఆర్
సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో ; తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారం సమ్మక్క- దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు చీర, సారె సమర్పించారు. శుక్రవారం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో వనదేవతల దర్శనానికై సిఎం కెసిఆర్ మేడారానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేడారానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్‌లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్‌ఎలు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద నుండి ప్రత్యే క వాహనశ్రేణిలో వివిఐపి దర్శన ద్వారం ద్వారా అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, గిరిజన పూజారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తలపై సిఎం కెసిఆర్ సారె మోయగా, ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ సైతం సారె తలపై పెట్టుకొని గద్దెల వద్దకు చేరుకున్నారు. మొదట సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి అమ్మవారిని సందర్శించుకున్నారు. సమ్మక్క తల్లికి సారె సమర్పించి పట్టువస్త్రాలు సమర్పించారు. తల్లికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం సారలమ్మ గద్దె వద్దకు వెళ్లి చీర, సారెలు సమర్పించి పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తరపున సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు చీరె, సారెలను సమర్పించిన అనంతరం గోవిందరాజుల గద్దె వద్దకు, ఆతరువాత పగిడిద్దరాజుల గద్దెల వద్దకు వెళ్లి సిఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతిబిడ్డపై ఉండాలని అమ్మవార్లను కోరుకున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ నిలువెత్తు బంగారాన్ని (51కిలోల బెల్లాన్ని) అమ్మవార్లకు సమర్పించారు. అక్కడి నుండి బయటకు వచ్చి సిఎం, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు హుండీలో అమ్మవార్లకు కానుకలు సమర్పించారు. దర్శన అనంతరం ములుగు ఎంఎల్‌ఎ సీతక్క సిఎం కెసిఆర్‌కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వనదేవతల చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమం త్రి మేడారం పర్యటనలో మంత్రులు దయాకర్‌రా వు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌లతో పాటు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎలు రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌లు, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో, పలువురు నాయకులు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్నారు. కాగా వనదేవతల దర్శనానికి సిఎం కెసిఆర్ విచ్చేయడంతో పోలీసులు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.