ప్రజాపక్షం/హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించామని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దనే ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రదర్శనలు, ర్యాలీలు, బార్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల, కోచింగ్ సెంటర్లు, పబ్బులను మార్చి 31 వరకు బంద్ చేయనున్నట్లు తెలిపారు. దీనిని అతిక్రమిస్తే విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని, వారి అనుమతులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఇది ఎప్పటికప్పుడు సమావేశమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నివేదికను అందజేస్తుందన్నారు. ‘కరోనా వైరస్’ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అత్యవసరంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ అసెంబ్లీ హాల్‌లో సమావేశమైంది. మంత్రివర్గ సమావేశనంతరం కెసిఆర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదని, భయోత్పాతం కావాల్సిన అసవరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు లేవని భరసానిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎవ్వరూ అయోమయానికి గురికావొద్దని సూచించారు. జనసమ్మర్ధం ఉండే వద్దకు ప్రజలు పోవద్దని, ఇలాంటి వద్దకు వెళ్లకుండా కొంత పక్కన ఉండడమే అతిముఖ్యమని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, న్యూఢిల్లీలో కొన్ని చర్యలు తీసుకుందని, కేంద్రప్రభుత్వం కూడా సూచనలు, సలహాలు అందిస్తుందని వివరించారు.
రాష్ట్రంలో విద్యాసంస్థలు మూసివేత
RELATED ARTICLES