మరోసారి ‘షట్‌డౌన్’ అంటూ ప్రచారం
ఈనెల 16, 17న సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
17న తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులతో సమీక్ష
ఆ తర్వాతే సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్?
ప్రజాపక్షం/హైదరాబాద్ కరోనావైరస్ రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రానున్న మరో నెల రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి, స్థానిక పరిస్థితులపై రాష్ట్రాల వారీగా ఆరా తీసింది. వీటి ఆధారంగానే ‘కొవిడ్- కట్టడికి ఏం చేయాలనే విషయమై ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 16,17న ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఒకరోజు కొన్ని రాష్ట్రాలు, మరో రోజు మిగిలిన రాష్ట్ర సిఎంలతో ప్రధాని చర్చించనుండగా, తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల వంతు 17న రానుంది. కాగా మరోసారి ‘షట్‌డౌన్’ విధించనున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు కొట్టిపారేయకపోయినప్పటికీ వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ‘షట్‌డౌన్’ తప్పకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పాసిటీవ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రధానంగా మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో ముందుండి పోరాడిన శాఖలే కరోనా వైరస్ భారిన పడడం ప్రభుత్వ వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వైద్యులకు కూడా కరోనా సోకడం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహారించాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాసిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ అన్ని శాఖలకు వ్యాప్తి చెందడం, పోలీసులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు కరోనా సోకుతోంది. అయితే చాలా ప్రాంతాల్లో భౌతిక ధూరాన్ని పాటించడం లేదు. మరి కొన్ని చోట్ల మాస్కులు ధరించడం లేదు. లాక్‌డౌన్‌కు కేంద్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇవ్వడంతోనే వైరస్ వ్యాప్తి పెరిగిందని అధికార పార్టీ నేతలు, మంత్రులు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంతి కెసిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి వీడియోకాన్ఫరెన్స్ సమీక్ష ముగిసిన తాజా పరిస్థితులపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో లాక్‌డౌన్ మరింత కఠినం
RELATED ARTICLES