సిపిఐ డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ కరోనా వైరస్‌ను నియంత్రించకపోవడంతోనే హైదరాబాద్ నగంలో కరోనా విలయతాండవం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్షలు నిర్వహించలేదనేందుకు ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులే నిదర్శనమని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లోనే పది మందికి కరోనా వైరస్ సోకడం ఆశ్చర్యకరమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని లేదా మం త్రివర్గ సమావేశాన్ని నిర్వహించి యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసైనా ప్రజలను ఆదుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఒకరిపై ఒకరు కరోనా రాజకీయాలు మానేసి మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫమైందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారని, అదే సమయంలో దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోద వుతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం మూడవ స్థానంలో నిలిచిందని, ఇందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైనట్టే కదా అని చాడా వెంకట్‌రెడ్డి అన్నా రు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ లేక రోగులు మృత్యువాతపడుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో కరోనా చికిత్సను కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా చికిత్స నిర్వహించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుతిస్తే వారు ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రి లో కరోనా చికిత్స పొందుతున్న ఫీవర్ ఆస్పత్రి డిఎంఒకు ఒక రోజు చికిత్స నిమిత్తం లక్షన్నర రూపాయల బిల్లు వేశారని, దీనిపై ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదిస్తే ఆమెను బంధించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న 5కిలోల బియ్యంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 5కిలోలు మొత్తం 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం మంచి నిర్ణయమేనని, అయినప్పటికీ బియ్యంతోనే పేదల కడుపు నిండదన్నారు.
రాష్ట్రాలకు రూ.10వేల కోట్ల సహాయం చేసేందుకు కేంద్రానికి : కష్టకాలంలో రాష్ట్రాలకు రూ10 వేల కోట్ల సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎంను పెంచి రుణాలను తీసుకునేందుకైనా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ. 7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యంత అధునాతనమైన వైద్య పరికరాలు, వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సహాయపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలో కేవలం మూడు, నాలుగు వేల కోట్లు మాత్రమే ప్రజలకిచ్చి, మిగతాది కార్పోరేట్ రంగానికి దోచిపెడుతున్నారని విమర్శించారు. కరోనాను గాలికి వదిలేస్తే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కరోనా ఆగడం లేదని, విజృంభిస్తోందన్నారు.
రాష్ట్రంలోహెల్త్ ఎమర్జెన్సీ
RELATED ARTICLES