HomeNewsBreaking News‘రామప్ప’కు వారసత్వ హోదా

‘రామప్ప’కు వారసత్వ హోదా

హెరిటేజ్‌గా ప్రకటించిన యునెస్కో
తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తొలికట్టడం
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ
హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు లభించింది. శిల్ప కళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం రికార్డును సృష్టించింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 800 ఏళ్ల కాలానికి చెందిన ఆలయ కాకతీయ శిల్పకళావైభవం ఖండాంతరాలు దాటింది. పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీస్తుశకం 1213లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు చైనా, ప్యారిస్‌లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ప్రతినిధులంతా రామప్ప ఆలయ విశిష్టతలను చూసి అచ్చెరువొందారు. ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించారు. తమ ఓట్లతో రామప్ప ఖ్యాతిని మరింత పెంచుతూ ప్రపంచ వారసత్వ గుర్తింపునిచ్చారు.
21 దేశాలు రామప్పకే అమోదం…
వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గతేడాది జూన్‌లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్‌ అయిన కట్టడాలపై ముందుగా ప్రతినిధులు చర్చించి అనంతరం ఓటింగ్‌ జరుపుతారు. దాదాపు 21 మంది దేశాల ప్రతినిధులు రామప్పకు అమోదం తెలుపడంతో ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు అమోదం తెలిపాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు యునెస్కో బృందం పేర్కొనగా దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను కేంద్ర ప్రభుత్వం వివరించింది. వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సమావేశంలో రూల్‌ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్‌లో పరిగణనలోకి తీసుకునేలా రష్యా చేసింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయిలాండ్‌, హంగేరి, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా తదితర దేశాల మద్దతిచ్చాయి. 2020, 21 సంవత్సరాలకు గాను, ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యూనెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా, మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
రోజుల తరబడి చూసినా తనివితీరని దృశ్యకావ్యం…
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమైంది. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు.. రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్‌ సదుపాయం కూడా ఉండటంతో పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించింది.
ఆశ్చర్యచకితులైన యూనెస్కో ప్రతినిధులు…
వారసత్వ గుర్తింపు పొందాలంటే సాధారణ విషయం కాదు. అనేక కీలక దశలు దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుర్తింపు రావడానికి అర్హతలు ఉండాలి. కళ్లార్పకుండా చేసే అద్భుత శిల్పాలు, ఆలయం పైభాగంలో నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, కుదుపులకు చెక్కుచెదరకుండా అద్భుత శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీతో ఆలయ నిర్మాణం తదితర విశిష్టతలు కలిగి ఉండడంతో రామప్పకు ఈ ఖ్యాతి లభించింది. ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి 2019 సెప్టెంబర్‌లో యూనెస్కో తరుఫున ప్రతినిధి, వాసు పోష్య నందన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అణువణువూ పరిశీలించారు. శిల్ప సౌందర్యాన్ని చూసి తన్మయులయ్యారు. నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ, ఇతర ప్రత్యేకతలను గురించి తెలుసుకుని ఆశ్చర్యచకితులయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితోనే ఈ కీర్తి…
ప్రాచీన కట్టడానికి వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేశాయి. రామప్పకు వారసత్వ గుర్తింపు దక్కేలా చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలో లేఖ రాశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. దేశం నుంచి ఒకే ఒక కట్టడమైన రామప్పను యూనెస్కో వారసత్వ గుర్తింపు కోసం నామినేట్‌ చేసింది. యునెస్కో అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ద్వారా ఆలయ ప్రత్యేకతలను పలుమార్లు తెలియజేస్తూ నిపుణులతో నివేదికలను పంపించింది. యూనెస్కో ఆహ్వానం మేరకు 2019 నవంబర్‌లో రాష్ట్రం నుంచి ఓ నిపుణుల బృందం ప్యారిస్‌ వెళ్లింది. ఆలయ ప్రత్యేకతలపై నిపుణుల సందేహాలను నివృత్తి చేశారు. ఆ తరువాత కూడా ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని యునెస్కో అడగడం అధికారులు పంపించారు. యునెస్కో అడిగిన పూర్తి సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సభ్యులు డోసియర్‌(పుస్తకం) రూపంలో యునెస్కో ప్రతినిధులకు అందచేశారు. ఇటీవలే రామప్ప విశిష్టతను తెలియచేస్తూ 6 భాషల్లో తీసిన వీడియోలను సైతం యునెస్కో ప్రతినిధులకు పంపించారు. గత నెల 23న మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ ఇతర అధికారులు ఢిల్లీకి వెళ్లి, నాటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవలే యునెస్కో తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రామప్ప చిత్రాలను ఉంచడం విశేషం.
తెలుగువారందరికీ గర్వకారణం : ప్రధాని నరేంద్ర మోడీ
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాకతీయుల కళాత్మకతకు ప్రతీకగా రామప్ప దేవాలయం నిలుస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు. మన రామప్పకు ఈ ఘనకీర్తి దక్కడం తెలుగువారందరికీ ఎంతో గర్వకారణమన్నారు. వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. ఘనమైన కట్టడాన్ని అందరూ సందర్శించి, గొప్ప అనుభూతి పొందాలని ప్రధాని కోరారు. ఇక దేశ విదేశీ పర్యాటకులు రామప్పకు బారులు తీరుతారని అన్నారు. దీని ద్వారా రామప్ప పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆకాక్షించారు. పర్యాటకం పెరిగితే, స్థానికులకూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
వారసత్వ గుర్తింపు పట్ల హర్షం
తెలంగాణ ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించటం పట్ల చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరపున ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రామప్ప చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణియమని మంత్రి కె.టి.రామరావు, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌లతో పాటు మంత్రులు, ఎం.పి, ఎంఎల్‌ఎలు హార్షం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments