మోడీ పర్యటన ప్రాంతాల్లో ప్రజలు బంద్ పాటించాలని పిలుపు
గవర్నర్ వ్యవస్థతో ప్రజాధనం వృథా అని విమర్శ
ప్రధాని నరేంద్ర మోడీని నిలదీసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాపక్షం/హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎపి పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోడీ… ఈ నెల 11న విశాఖపట్నం, 12న రామగుండం పర్యటనను నిరసిస్తూ ఆ ప్రాంతాల్లో ప్రజలు బంద్ పాటించాలని, నల్ల జెండాల నిరసనలతో గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పశ్య పద్మ, ఇటి నర్సింహాలతో కలిసి హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండానికి వచ్చి ఏం చేస్తారని నారాయణ ప్రశ్నించారు. మోడీ ఎపి పర్యటన సందర్భంగా విశాఖపట్నం బంద్‌కు సన్నాహాలు జరుగుతన్నాయని, మోడీ నిరసనలు, అవమానంలోనే అడుగు పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బ్రిటీష్ కాలం నాటి గవర్నర్, రాష్ట్రపతి వ్యవస్థను మొదటి నుండి కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నదని, నాడు బ్రిటీష్ తాబేదారులను గవర్నర్లుగా నియమించేవారని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి లేకుండా ఈ వ్యవస్థను అమలు చేసిందని మండిపడ్డారు. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేరళ ప్రభుత్వానికి భ్రష్ఠుపట్టిన గవర్నర్ అడ్డుపడుతారా? అని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ వల్ల ఏటా రూ.60 నుండి రూ.70 కోట్ల ప్రజాధనం నష్టం జరుగుతోందన్నారు. బిజెపి ప్రతికూల రాష్ట్ర ప్రభుత్వాలపై సిబిఐ, ఇడి, గవర్నర్ వ్యవస్థల ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.
గవర్నర్‌పై చర్య తీసుకోవాలి
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను రీకాల్ చేసి, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి డాక్టర్ నారాయణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ రెండు వ్యవస్థలూ దేశానికి నష్టమని, ఈ రెండు వ్యవస్థలు బ్రిటీష్ కాలం నాటి బానిస వ్యవస్థలకు ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. తాము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదివితే, గవర్నర్ తమిళిసై ఆర్‌ఎస్‌ఎస్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకుని మాట్లాడుతున్నారన్నారు. ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రకటించిన సమయంలోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లక్ష్మణరేఖ దాటుతున్నారని తాము ఇదివరకే ప్రకటించిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రజాదర్భార్‌లో వచ్చే సమస్యలపై కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుందని, తద్వారా ఆ సమస్యను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కేంద్రానికి ప్రతిపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులో రెండుసార్లు ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారని, రాజకీయ నిరుద్యోగ భృతి కింద ఆమెకు బిజెపి ప్రభుత్వం గవర్నర్‌గా నియమించిందని విమర్శించారు. స్వయంప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాలకు ఛాన్స్‌లర్ హోదాలో ఉన్న గవర్నర్ ఉద్యోగ నియామకాలను ఆపడం ఏమిటని మండ్డిపడ్డారు. అక్కడ నియామకాలు, ఇతర అంశాలను పూర్తిగా వైస్ ఛాన్స్‌లర్లు చూసుకుంటారని సూచించారు
దక్షిణాదిపై బిజెపి దండయాత్ర : కూనంనేని
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దండయాత్ర చేపట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ఇడి, సిబిఐ దాడులను చేపట్టడంతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దేశాన్ని క్రిమినల్స్ పాలిస్తున్నారని, అందుకే ఆ క్రిమినల్ మైండ్‌తోనే ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలు, ప్రత్యర్థులపైన దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అదే కోవలో ఒకవైపు ప్రభుత్వాన్ని గవర్నర్‌తో ఇరకాటంలో పెట్టించడంతో పాటు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌పై ఇడి దాడులు చేయిస్తున్నారన్నారు. తామూ బిజెపికి చెందిన నేతలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సిబిఐ, ఇడిలకు ఫిర్యాదు చేస్తామని, వీరిపై కూడా దాడులు నిర్వహిస్తే అప్పుడు ఈ సంస్థలను గౌరవిస్తామన్నారు. నామా నాగేశ్వర్‌రావుపై ఇడి, సిబిఐ దాడులు జరిగాయని, ఆయన ఆ పార్టీలో చేరివుంటే కేసులు ఉండేవి కావన్నారు. ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంపై సిట్‌ను ఏర్పాటు చేయడం పట్ల కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షాపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులోని నిందితుల కాల్ డేటాను పరిశీలించాలన్నారు. ఈ కేసును వెలుగులోనికి తీసుకొచ్చిందే తెలంగాణ రాష్ట్ర పోలీసులు అని, అందుకే ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు రావాలని డిమాండ్ చేశారు. సిట్ నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు జరపాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి, ఎంఎల్‌ఎల కొనుగోలు, బిజెపి అప్రజాస్వామిక వ్యతిరేక చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే దుష్ట చర్యలకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామన్నారు.
రామగుండం బంద్‌ను జయప్రదం చేయండి
ప్రధాని పర్యటన సందర్భంగా ఈనెల 12న సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘రామగుండం బంద్’ను విజయంతం చేయాలని కూనంనేని సాంబశివరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌లో కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామన్నారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. తమ అనేక పోరాటాల ఫలితంగా కాంట్రాక్టర్ల చేతుల్లో ఉన్నబొగ్గుబావులు ప్రభుత్వ పరమయ్యాయని గుర్తు చేశారు. అలాంటి బొగ్గుబావులను ప్రైవేటుపరం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసి, ఆ తర్వాత ఈ సంస్థను మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేయనున్నారని ధ్వజమెత్తారు.
బిజెపిని విమర్శిస్తే నా ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్‌ను రద్దు చేస్తారా?
తాను బిజెపిని విమర్శించే ప్రకటనలను సోషల్ మీడియా గ్యాలరీలో లేకుండా తొలగిస్తున్నారని, తన ఫేస్‌బుక్‌ను, ట్విట్టర్ ఖాతాలను రద్దు చేశారని కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. మోడీ, బిజెపికి చెందిన తన ప్రకటనలు ఎక్కువ మందికి షేర్ కాకుండా చూస్తున్నారని, తాను ప్రజాస్వామ్య యుతంగానే మోడీపై విమర్శలు చేస్తున్నానని, తనపై క్రిమినల్ రికార్డ్ కూడా లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు గవర్నర్ తమిళిసైకి అనుమానం వ్యక్తమైతే, కేంద్ర ఆధీనంలో ఉండే టెలికామ్ సంస్థ ద్వారా విచారించి, నిర్ధారణ జరిగితే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్ రాష్ట్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నిరసిస్తూ త్వరలోనే రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
రామగుండానికి వచ్చి ఏం చేస్తారు?
RELATED ARTICLES