కార్పొరేటర్లు, కాంట్రాకర్లకేనా ?
అర్హులకు అందని అవకాశం
ప్రజాపక్షం/గోదావరిఖని
రామగుండం మునిసిపల్ కార్పొరేషన్‌లో అద్దె ‘కార్ల కిరి కిరి’ కొనసాగుతున్నది. – కార్పొరేటర్లు, కాంట్రాకర్లకు మాత్రమే కార్లు కేటాయిస్తూ, అవి కూడా వారే అద్దె ప్రాతిపదికన నిర్వహించేకునే వ్యవహారంపై కార్పోరేషన్‌లో సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లతో పాటు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కోసం అద్దె ప్రాతిపాదికన నిర్వహిస్తున్న కార్ల (వాహనాల) నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యవహారం అర్హులు, సామాన్యులు ఇదివరకు అదే ఫీల్డ్‌లో కొనసాగుతున్న డ్రైవర్లు లేదా సొంత వాహనాలు కలిగి ఉండి ఉపాధి పొందుదామనుకునే వారికి అశనీపాతంగా మారిందని పలువురు ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొంతమంది కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల చేతిలో గుత్తాధిపత్యంగా ఈ నిర్వహణ కొనసాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్, ఎగ్జామినర్‌కు కార్ల ఎంపిక చేసినా కొందరు కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లకే అనుకూలంగా కార్లు పెట్టుకునేలా ఒక అధికారి చక్రం తిప్పుతున్నారని కార్పోరేషన్ కార్యాలయ వర్గాలు చెప్పుకోవడం గమనార్హం. ఇక సదరు కాంట్రాక్టర్లు అధికారులకు సకాలంలో కార్లను అందుబాటులో ఉంచకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు కింది స్థాయి సిబ్బంది చెప్పుకోవడం అధికారులకు నామోషీగా తయారైంది. ఆ కాంట్రాక్టర్లపై అజమాయిషీ లేని పరిస్థితిని అధికారులు తెచ్చుకోవడం పట్ల పలు విమర్శలతో పాటు జరుగుతున్న తంతుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో నాణ్యతతో కూడిన పనులు చేయించుకోవాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారారా అని కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలనే కార్ల కేటాయింపు చేపట్టిన అధికారులు పలువురు కాంట్రాక్టర్లు, కార్పొరేటర్ల వాహనాలను నడిపించుకునేలా చేసి ఒక సాధారణ వ్యక్తిని వాహనాల నిర్వహణ బాధ్యతల నుండి తొలగించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు చూపెడుతున్న అశ్రిత పక్షపాతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కాంట్రాక్టర్లు-, అధికారుల వాగ్వివాదం?
ఇటివల కాలంలో కాంట్రాక్టర్లకు అధికారులకు కార్లు నిర్వహించుకునేలా చేసే ప్రక్రియలో వివాదం నడిచినట్లు కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. సకాలంలో పనులు నిర్వహించకుండా పెండింగ్‌లో పెట్టిన వారే కార్లు నడిపించుకుంటూ ఉండడం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్ల నిర్వహణ టెండరు ప్రకారం నిర్వహించాల్సి ఉండగా అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుండడం, ఇందుకు కాంట్రాక్టర్లు, కార్పొరేటర్ల అజమాయిషీ వెరసి సామాన్యులకు అందుబాటులో కార్ల నిర్వహణ లేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అర్హత కలిగిన సాధారణ వ్యక్తులను ఎంపిక చేసి వారి జీవితాలను నిలిపేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం కార్పొరేషన్‌లో ‘కార్ల’ కిరి కిరి
RELATED ARTICLES