HomeNewsBreaking Newsరాఫెల్‌ డీల్‌లో దళారీ 10 లక్షల యూరోల ‘లంచం’

రాఫెల్‌ డీల్‌లో దళారీ 10 లక్షల యూరోల ‘లంచం’

ఫ్రెంచ్‌ మీడియాలో గుప్పుమన్న వార్త
దేశంలో హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఈ దళారీ
ప్రధాని నరేంద్రమోడీ దేశానికి సమాధానం చెపాలి
సమగ్ర దర్యాప్తు జరపాల్సిందే : కాంగ్రెస్‌ డిమాండ్‌
పారిస్‌ : భారత రక్షణరంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాఫెల్‌ విమానాల దిగుమతి వ్యవహారంలో ఉత్పత్తిదారులు భారత్‌లోని దళారీకి లంచం ఇచ్చారన్న వార్తలు ఫ్రెంచ్‌ మీడియాలో గుప్పుమన్నాయి. రాఫెల్‌ జెట్‌ యుద్ధ విమానాలు తయారు చేసే డస్సౌల్ట్‌ ఎవియేషన్‌ ఉత్పత్తిదారు భారత్‌లోని ఒక దళారికి 10 లక్షల యూరోలు లంచంగా చెల్లించిందని ఫ్రెంచ్‌ మీడియాలో ఏప్రిల్‌ 4వ తేదీన వార్తలు వెలువడ్డాయి. వినియోగదారులకు బహుమతుల రూపంలో లంచాలు చెల్లించినట్లు లెక్కల్లో తేలడం సిగ్గుచేటని పేర్కొంటూ దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌పార్టీ సోమవారంనాడు డిమాండ్‌ చేసింది. భారత వైమానికదళం 58 వేల కోట్ల రూపాయలతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడానికి ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 14 యుద్ధ విమానాలు భారత్‌ చేతికి అందాయి. డస్సౌల్ట్‌ కంపెనీ ఎలాంటి అవినీతి జరగడానికి తావులేకుండా ఫ్రెంచ్‌ అవినీతి నిరోధక సంస్థ “ఏజెన్స్‌ ఫ్రాన్సియాస్‌ యాంటీ కరప్షన్‌ (ఎఎఫ్‌ఎ)”కు చెందిన ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ విషయం వెల్లడైంది. 50 అతి పెద్ద రాఫెల్‌ జెట్‌ మోడల్స్‌ తయారీకి మధ్య దళారికి డబ్బులు చేతులు మారినట్లు ఫ్రెంచ్‌ మీడియా ‘మీడియాపార్ట్‌’ పేర్కొంది. భారత్‌లో ఒకవైపు ఐదు రాష్ట్రాలలో అతి కీలకమైన అసెంబ్లీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పూర్వరంగంలో ఫ్రెంచ్‌ మీడియాలో ఈ వార్తలు వెలువడటంతో మోడీ ప్రభుత్వం గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇంతవరకు డస్సౌల్ట్‌ ఎవియేషన్‌ కంపెనీ ప్రతిస్పందించలేదు. ఈ కంపెనీ యాజమాన్యం, బాధ్యులైన వ్యక్తులు ఈ వార్తలపై తమ స్పందన ఏమిటో ఇంతవరకు తెలియజేయలేదు. క్కెవరీ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. 2016 సెప్టెంబులో భారత్‌ రాఫెల్‌ యుద్ధ విమానాల దిగుమతికి ఉత్తర్వులు ఇచ్చింది. భారత్‌ ప్రభుత్వానికి, ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి మధ్య అత్యున్నత స్థాయిలో ఈ యుద్ధ విమానాల ఉత్పత్తికి, ఇచ్చి పుచ్చుకోవడానికి ఒప్పం దం కుదిరింది. ఫ్రెంచ్‌ మీడియాపార్ట్‌ నివేదిక ప్రకారం, 5,08.925 యూరోలు ఖర్చుగా చూపించి, దానిని వినియోగదారులకు బహుమతులుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందేహాస్పద చెల్లింపుల గురించి తెలుసుకున్న ఎఎఫ్‌ఎ ఇన్‌స్పెక్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. క్లుంట్లకు బహుమతులుగా ఈ 5,08,925 ఒక విడత యూరోలు చెల్లించినట్లు వారు తెలుసుకున్నారు. రాఫెల్స్‌ పత్రాలపై మూ డు భాగాలుగా జరిపిన దర్యాప్తులో మొదటి విడత పర్యవేక్షణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాఫెల్‌ జెట్‌ విమానాలపై 2016లో సంతకాలు చేసి ఒప్పం దం కుదిరిన తర్వాత 10 లక్షల యూరోలు మధ్యవర్తికి చెల్లించడానికి డస్సౌల్ట్‌ ఉత్పత్తిదారు అంగీకరించినట్లు నిర్ణీత ప్రకారం జరిగిన గ్రూప్‌ ఆడిట్‌లో ఎఎఫ్‌ఏ ఇన్‌స్పెక్టర్లు కనుగొన్నట్లు మీడియాపార్ట్‌ అర్థం చేసుకుందని, అయితే ఈ డబ్బు తీసుకున్న మధ్యదళారి ప్రస్తుతం భారతదేశంలో మరో రక్షణ సంబంధమైన ఒప్పందానికి సంబంధించి హవాలా కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆ మీడియా పార్ట్‌ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ ప్రాసిక్యూటర్ల దృష్టికి తీసుకువెళ్ళకూడదని ఎఎఫ్‌ఏ నిర్ణయించినట్లు కూడా ఫ్రెంచ్‌ మీడియా పార్ట్‌ కథనం పేర్కొంది. లంచంగా పేర్కొన్న 5,08,925 యూరోలను లెక్కాపత్రం లేకుండా వివిధ ఖాతాలకు జమ చేయడాన్ని ఇన్‌స్పెక్టర్లు గమనించారు. అత్యంత గోప్యంగా ఉండే తదుపరి రహస్య నివేదికను కూడా ప్రాసిక్యూటర్లకు తెలియజేయకూడదని ఎఎఫ్‌ఏ నిర్ణయించిందని మీడియా పార్ట్‌ పేర్కొంది. ఈ మొత్తాన్ని భారీ బహుమతిగానే భావిస్తున్నారు. ఈ బహుమతిని సమర్థిస్తూ, 2017 మార్చి 30న ప్రొఫార్మా ఇన్వాయిస్‌ను ఎఎఫ్‌ఎకు డస్సౌల్ట్‌ కంపెనీ అందజేసింది. ఈ ఇన్వాయిస్‌ను భారత్‌కు చెందిన డెఫ్‌సైస్‌ సొల్యూషన్స్‌ అనే కంపెనీ ఇచ్చింది. ఈ మొత్తం 1,017,850 యూరోల ఆర్డరులో యాభై శాతం ఆర్డరుకు సంబంధించిన ఇన్వాయిస్‌లో 50 రాఫెల్‌ ‘సి’ మోడల్స్‌ను ఒకొక్కటీ 20,357 యూరోల ధరకు అందించేవిధంగా కోట్‌ చేశారని నివేదిక పేర్కొంది. డెఫ్‌సైస్‌ సొల్యూషన్స్‌ అనే కంపెనీ గుప్తాల కుటుంబానికి చెందినదని, ఆ కుటుంబంలోని మూడు తరాల సభ్యులు ఏరోనాటికల్‌, డిఫెన్స్‌ ఇండస్ట్రీస్‌లో మధ్యదళారులుగా వ్యవహరించారని, 2019 జనవరి నుండి రెండు భారత మీడియా నివేదికలు కూడా, ఈ కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు సుసేన్‌ గుప్త డస్సౌల్ట్‌ కు ఏజంట్‌గా వ్యవహరించాడని, రాఫెల్‌ కాంట్రాక్టులో ఆయన పనిచేసి, భారత రక్షణ మంత్రిత్వశాఖ నుండి అత్యంత గోప్యమైన డాక్యుమెంట్లను సంపాదించారని నివేదిక పేర్కొంది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వివిఐపి చోపర్‌ స్కామ్‌ కేసులో అతడి పాత్రపై భారత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. 2018 అక్టోబరునెలలో అనిల్‌ అంబానీకి తప్పనిసరిగా ఎగుమతి కాంట్రాక్టు ఇవ్వాలని రాఫెల్‌ ఒప్పందంలో భారత్‌ పేర్కొనడంపై ఫ్రెంచ్‌ మీడియాలో ఒకభాగం ఆనాడు దీనిపై ప్రశ్నలు లేవనెత్తింది. డస్సౌల్ట్‌ ఏవియేషన్‌కు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ భాగస్వామ్యం ఉండేట్టు చూశారని పేర్కొంది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో భారత్‌ ప్రభుత్వం 8.7 బిలియన్‌ డాలర్ల తో ఒప్పందం చేసుకోవాలని భారత్‌లో ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించిందని 2015 ఏప్రిల్‌ నెలలో డసౌల్ట్‌ కంపెనీ ప్రకటించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అంతకుపూర్వం యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బదులుగా ఈ నిర్ణయం జరిగింది. అప్పట్లో 126 రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనాలని యుపిఎ నిర్ణయించింది. వాటిల్లో 108 విమానాలను టెక్నాలజీ బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వరంగ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లోనే తయారు చేయించాలని నిర్ణయం జరిగింది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యతిరేకించడంతో ఎన్‌డిఏ ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం వివాదాస్పదంగా మారింది. రాఫెల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ఒక్కొక్కటీ 1,670 కోట్లు కొనుగోలు ధర నిర్ణయించిందని, యుపిఎ ప్రభుత్వహయాంలో కొనే ప్రయత్నం చేసినప్పుడు ఈ కంపెనీ చెప్పిన 526 కోట్ల రూపాయల ధర కంటే ఇది మూడు రెట్లు అధికంగా ఉందని కాంగ్రెస్‌ గగ్గోలు పెట్టింది. అయితే అప్పటికీ ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ విమానాల ధరలకు సంబంధించిన వివరాలను అప్పట్లో బహిర్గతం చేయలేదు. అయితే గిట్టుబాటు కాదనే ప్రాతిపదికపై యుపిఎ ప్రభుత్వ ఒప్పందం 2012లోనే ఆగిపోయిందని, ఈ ఒప్పందం ఈ ఒప్పందానికి 2014 వరకు స్వస్తి పలకలేకపోయిందని బిజెపి ప్రభుత్వంలోని రక్షణమంత్రి మనోహర్‌ పరిక్కర్‌ చెప్పారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంవల్ల, వ్యూహాత్మక కారణాలవల్ల ఈ ధరలను బహిర్గతం చేయలేమని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆనాడు పేర్కొంది.
సమగ్ర దర్యాప్తుకు కాంగ్రెస్‌ డిమాండ్‌
రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగిందని తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఎప్పటినుండో చెబుతున్నారని, ఫ్రెంచ్‌ మీడియా ‘మీడియాపార్ట్‌’ కథనం ఇదే నిజమని తేల్చిందని కాంగ్రెస్‌పార్టీ సోమవారంనాడు విమర్శించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. అయితే బిజెపి దానిని తిరస్కరించింది. భారత్‌కు చెందిన డెఫ్‌సైస్‌ సొల్యూషన్స్‌ కంపెనీ మధ్యవర్తులకు 1.1 మిలియన్‌ యూరోలు ముడుపులు బహుమతుల రూపంలో చెల్లించారని డస్సౌల్ట్‌ ఎవియేషన్‌ కంపెనీలో జరిగిన ఆడిటింగ్‌లో బహిర్గతమైంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య అధికారికంగా ఒప్పందం జరిగినప్పుడు కమిషన్లకు తావెలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు వెలుగుచూసినప్పుడు ఆ ఒప్పందాలను రద్దు చేయడమే శ్రేయస్కరమని, నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయని ఆయన అన్నారు. రాహుల్‌గాంధీ పదే పదే ఈ విషయం ఉద్ఘాటించారని, ఈరోజు అదే నిజమైందని సూర్జేవాలా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశానికి ఈ విషయంపై సమాధానం చెప్పాలని ఆయన పత్రికాగోష్ఠిలో డిమాండ్‌ చేశారు.
అంతా వట్టిదే ః తేలిగ్గా కొట్టిపారేసిన బిజెపి
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ఫ్రెంచ్‌ మీడియా కథనంపై కాంగ్రెస్‌పార్టీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని బిజెపి సోమవారంనాడు కొట్టిపారేసింది. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందని, ‘కాగ్‌’ నివేదిక కూడా ఇందులో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్‌ నాయకుడు రవిశంకర్‌ ప్రసాద్‌ న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. లంచాల ఆరోపణలపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు దీనిని పెద్ద సమస్యగా చిత్రీకరించాయని, అయినప్పటికీ అవి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తి అర్థరహితమని, భారత్‌తో ఉన్న కార్పొరేట్‌ పరమైన శత్రుత్వంతోనే ఫ్రెంచ్‌ మీడియాలో ఇలాంటి వార్తలు వెలువడుతున్నాయని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments