మళ్లీ తెరపైకి అవినీతి రగడ
న్యూఢిల్లీ : ‘రాఫెల్’ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై చెలరేగిన రగడ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని వచ్చిన విమర్శలపై ఫ్రాన్స్ దర్యాప్తును ప్రారంభించడంతో, రెండేళ్ల క్రితం యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించిన ‘రాఫెల్’ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ‘రాఫెల్’ అవినీతిపై మళ్లీ యుద్ధానికి తెరతీసింది. సుమారు 59,000 వేల కోట్ల విలువైన ‘రాఫెల్’ ఒప్పందంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 2016లో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేసింది. విచారణ నిమిత్తం ఒక న్యాయమూర్తిని కూడా నియమించినట్టు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం కుదిరిప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలండే అందులో కీలక పాత్ర వహించారా? లేదా? ముడుపుల ఆరోపణల్లో ఆయన కూడా ఉన్నారా? లేదా? అనే అంశాలపై ఫ్రాన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. న్యాయమూర్తి నేతృత్వంలో జరిగే విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలువడతాయన్నది ఆసక్తిని రేపుతున్నది. కాగా, రాఫెల్ యుద్ధ విమాన కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇందు కోసం జెసిసిని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, తక్షణమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. రాఫెల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలను బిజెపి, కాంగ్రెస్ మధ్య వివాదంగా చూడరాదని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఫ్రాన్స్ ప్రభుత్వం నమ్ముతున్నది కాబట్టే విచారణ జరిపిస్తున్నదని సుర్జీవాలా అన్నారు. అదే విధంగా మన దేశంలోనూ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
‘రాఫెల్’ ఒప్పందంపై ఫ్రాన్స్ దర్యాప్తు
RELATED ARTICLES