HomeNewsBreaking Newsరాజ్‌కోట్‌ రాజెవరో!

రాజ్‌కోట్‌ రాజెవరో!

గెలుపే లక్ష్యంగా భారత్‌.. ఆత్మవివ్వాపంతో బంగ్లా
నేడు రెండో టీ20 మ్యాచ్‌
కుర్రాళ్లకు మంచి అవకాశం
రోహిత్‌ను ఊరిస్తున్న మరో రికార్డు
రాజ్‌కోట్‌: మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బంగ్లా బ్రేక్‌లు వేసింది. మూడో టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లా భారత్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో 1-0తో సిరీస్‌ ఆధిక్యంలో నిలిచింది. ఇక రాజ్‌ కోట్‌ వేదికగా సాగే రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతంచేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే టీమిండియా మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రెండో టి20లో గెలుపొంది సిరీస్‌ను సమం చేసి బాంగ్లాను ఒత్తిలోకి నెట్టాలనే యో,నలో ఉంది. అందుకనుగుణంగా టీమిండియా సభ్యులో నెట్స్‌లో తీవ్ర కఠోర సాధనను చేశారు. రెగ్యూలర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి లేకున్నా భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భీకర ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, షకిబ్‌ అల్‌ హసన్‌ లేకుండా సిరీస్‌కు సిద్ధమైన పర్యాటక జట్టు బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌ సవాలుగా మారింది. కీలక ఆటగాడు లేక పోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే షకిబ్‌ లేకున్నా బంగ్లాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో ఆడడంద ద్వారా టి ఫార్మాట్‌లో వీరు ఎంతో రాటుదేలారు. బ్యాటింగ్‌లో బంగ్లా చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా బాగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
ధవన్‌, రోహిత్‌ రాణిస్తే..
ఆదివారం ఢిల్లీ జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ త్వరగానే ఔటైనా ధావన్‌ మాత్రం 47 పరుగులు చేసి భారత్‌కు మంచి ఆరంభాన్నే అందించాడు. దీంతో రెండో టి20లోను శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు కీలకంగా మారారు. ఇద్దరు ఇప్పటికే అత్యుత్తమ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈసారి కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో కనిపిస్తున్నాడు. రోహిత్‌ జోరును కొనసాగిస్తే బంగ్లాకు కష్టాలు ఖాయం. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వరద పారించడం రోహిత్‌ అలవాటుగా మార్చుకున్నాడు. రోహిత్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రోహిత్‌కు ఉంది. ఇక, మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా సత్తా చాటాడు. కానీ, రోహిత్‌ కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగితే ఈ మ్యాచ్‌లో బంగ్లాకు భారీ సవాల్‌ ఎదురు కానుంది.
పంత్‌ ఈ మ్యాచ్‌లోనైనా..
కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రిషబ్‌పంత్‌, లోకేశ్‌ రాహుల్‌లకు ఇది మంచి ఛాన్స్‌గా చెప్పాలి. జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే వీరిద్దరూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. తొలి మ్యాచ్‌లో పంత్‌ ఎక్కువ పరుగులు చేయకపోయినా ఎక్కువ సమయం క్రీజులో గడిపాడు. ఇది భారత్‌కు ఊరించే అంశం. ఇక కీనింగ్‌ ధోనీని అనుకరించబోయి డిఆర్‌ఎస్‌ కోరాడు. కానీ అది విఫలమడంతో నవ్వుపాలయ్యాడు. కాగా, పంత్‌ కొంచెం పరిణతి చెందినట్లుగానే కనిపిస్తున్నాడు. మరోవైపు శాంసన్‌ను కోహ్లి స్థానంలో బ్యాట్స్‌మన్‌గా తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అతనికి ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేతో గట్టి పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందో ఆసక్తిగా తయారైంది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఖాయమనే చెప్పాలి. అతను నాలుగు, లేదా ఐదో నంబర్‌లో దిగే అవకాశం ఉంది. మనీష్‌ పాండే జట్టులో ఉన్నా అతనికి అవకాశం ఇస్తా రా లేదా అనేది సందేహంగా తయారైంది. కొంతకాలంగా మనీష్‌ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి బదులు అయ్యర్‌వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. ఇక, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో ఖలీల్‌, దీపక్‌, శార్దూల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిలో ముగ్గురికి అవకాశం దక్కడం కష్టంగా మారింది. స్పిన్నర్లకే ఎక్కువే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముగ్గురిలో ఎవరికి చోటు దక్కుతుందో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
సిరీస్‌ గెలవాలనే తపనలో..
తొలి మ్యాచ్‌ 7 వికెట్లతో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ ఎలాగైనా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది సరీస్‌ను స్వాధీనం చేసుకోవాలనే తపనలో ఉంది. ఇందుకు భారీ ఆశలతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. కానీ, కీలక ఆటగాడు షకిబ్‌ దూరం కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లింది. కానీ, షకిబ్‌ లేకున్నా బంగ్లా జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. ముష్ఫికుర్‌ రహీం, లిటన్‌ దాస్‌, కెప్టెన్‌ మహ్మదుల్లా, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ మిథున్‌, మొసద్దెక్‌ హుస్సేన్‌ తదితరులతో బంగ్లా బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. అంతేగాక ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ రూపంలో మ్యాచ్‌ను శాసించే బౌలర్‌ ఉండనే ఉన్నాడు. అమిన్‌, అబు హైదర్‌ తదితరులతో బౌలింగ్‌ కూడా పటిష్టంగా మారింది. ఇటు, బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో మెరుగైన ఆటగాళ్లు ఉండడంతో బంగ్లాదేశ్‌ కూడా సంచలన ఫలితంపై కన్నేసింది.
మార్పులతో బరిలోకి భారత్‌
రెండో టీ20లో స్వల్ప మార్పులు చేయనున్నట్లు టీమిండియా స్టాండఇన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. రాజ్‌కోట్‌ పిచ్‌ ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. గత ఆదివారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు, ఒక మీడియం పేసర్‌ శివన్‌ దూబేతో పాటు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగినప్పటికీ ఏడు వికెట్లు తేడాతో ఓడిపోయింది. దీంతో రెండో టీ20లో టీమిండియా బౌలింగ్‌తో మార్పులు చేయనున్నారు. దీనిపై రెండో టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ‘మా బ్యాటింగ్‌ బాగుంది. కాబట్టి బ్యాటింగ్‌లో మనం చేయాల్సిన మార్పులు ఏమీ లేవు. కానీ, పిచ్‌ను విశ్లేషించి… దాని ఆధారంగా జట్టుగా ఏమి చేయగలమో అదే చేస్తాము‘ అని పేర్కొన్నాడు. దీంతో రెండో టీ20లో ఖలీల్‌ అహ్మాద్‌ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ చోటు దక్కుతుందేమోనని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పిచ్‌ పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయని రోహిత్‌ శర్మ సూచాయగా చెప్పాడు. ‘పేస్‌ బౌలింగ్‌ కాంబినేషన్‌తో గత మ్యాచ్‌లో ఆడాం. ఢిల్లీ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని అన్నాడు.
రోహిత్‌ 100 టి20ల రికార్డు
టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి భారతీయుడిగా అవతరించనున్నాడు. ప్రపంచ క్రికెట్లో శతక మ్యాచ్‌ల ఘనత అందుకోనున్న రెండో ఆటగాడు హిట్‌మ్యాన్‌ కానున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండో మ్యాచ్‌ అతడి కెరీర్‌లో వందోది. పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (111 మ్యాచ్‌లు) అతడి కన్నా ముందున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు రోహిత్‌ శర్మ పేరిటే ఉంది. 99 మ్యాచుల్లో 136.67 స్ట్రైక్‌రేట్‌తో అతడు 2,452 పరుగులు చేశాడు. నాలుగు శతకాలు, 17 అర్ధశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. బంగ్లాతో తొలి పోరులో అతడు కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు చేసిన సంగతి తెలిసిందే. ’నాది సుదీర్ఘ ప్రయాణం. 2007లో టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాను. ప్రత్యేకించి ఈ ఫార్మాట్లో 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ముందుకెళ్లేందుకు ఇది నాకెన్నో పాఠాలు నేర్పించింది. జట్టులోకి యువకుడిగా వచ్చినప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగాను. ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదురయ్యాయి. నా ఆటను అర్థం చేసుకుని పటిష్ఠ ఆటగాడిగా ఎదిగాను. మాట్లాడేందుకు ఎన్నో ఉన్నాయి. నా కెరీర్‌ నాకెంతో సంతోషం, మధుర స్మృతులను ఇచ్చింది’ అని రోహిత్‌ అన్నాడు.

నిలదొక్కుకునేందుకు సహాయపడుతుంది
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ తొలి టీ20 గెలిచి 1-0ఆధిక్యంతో కొనసాగుతుంది. ఐదుగురు యువ క్రికెటర్లతో బరిలోకి దిగిన భారత్‌.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మేరకు తర్వాతి మ్యాచ్‌లలో జట్టులో ఏదైనా మార్పులు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. కింగ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో తాత్కాలిక కెప్టెన్‌ గా బాధ్యతలు తీసుకున్న రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ’ఈ ఫార్మాట్‌ ఎంతో మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకునేందుకు సహాయపడుతుంది. టాలెంట్‌ తో ఉన్న యంగ్‌ ప్లేయర్లను తీసుకునేందుకు కీలకమైన ఆటగాళ్లు మ్యాచ్‌ లకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఫార్మాట్‌ ను బట్టి వేరే జట్టుతో ఆడుతూ వస్తున్నాం. టీ20 లాంటి ఫార్మాట్లలో వారిని ఆడిస్తే ఎటువంటి నష్టాలు ఉండవు’ ’చాలా మంది ప్లేయర్లను ఈ ఫార్మాట్లో ఆడించాం. వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఆడేందుకు వారికి అనుభవం పనికొస్తుంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments