HomeNewsBreaking Newsరాజ్యాంగ రక్షణకు ఐక్యపోరాటం

రాజ్యాంగ రక్షణకు ఐక్యపోరాటం

ఆవశ్యకత గుర్తించిన ప్రతిపక్షాలు
‘పాట్నా మీట్‌’ నిర్వహించిన నితీశ్‌, తేజస్విలకు డి.రాజా అభినందన
పాట్నా :
దేశ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఐక్యంగా పోరాటాలు చేయవలసిన ఆవశ్యకతను ప్రతిపక్షాలు గుర్తించాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ప్రతిపక్షాల ‘పాట్నా మీట్‌’ జరిగిన మరునాడు శనివారం ఆయన పాట్నాలో పత్రికాగోష్టిలో మాట్లాడుతూ, దేశ రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతిపక్షాలు ఈ సమావేశంలో గుర్తించాయని, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని అన్నారు. కేంద్రంలో బిజెపి పరిపాలన దేశానికి, భారత రాజ్యాంగానికీ వినాశకరంగా తయారైందని విమర్శిస్తూ, ఈ సమస్యపై ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన ఆవశ్యకతను ఇప్పుడు గుర్తించాయన్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రజలు బిజెపి అనుసరించిన రాజకీయ, విద్వేష, విభజన చర్యలను నిర్ణయాత్మకమైన ఓటింగ్‌ద్వారా తిరస్కరించారని అన్నారు. “రాజ్యాంగంపై దాడిచేసి, విద్వేష రాజకీయాలను వ్యాప్తి చేస్తున్న శక్తులను ఓడించి తీరాల్సిందే”అని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఇంటికి సాగనంపాల్సిందేనని ఉద్ఘాటించారు. శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరైన డి. రాజా ఈ సందర్భంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను అభినందించారు. ఎన్నో నెలలుగా కృషి చేసి ప్రతిపక్షాలను ఉమ్మడి ఎజెండాపై కృషి చేయడానికి వీలుగా ఒకే వేదికపైకి నితీశ్‌ కుమార్‌ తీసుకువచ్చారని అభినందనలు తెలియజేశారు.దేశంలో ఉన్న అన్ని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను ఒకే వేదికపైకి ఆయన తీసుకువచ్చారని అన్నారు. “ఈ పాట్నామీట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది, ఎందుకంటే, బిజెపి నాయకత్వానగల కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థలపైనా చాలా పెద్ద దాడి జరుగుతోంది, రాజ్యాంగం సహా అన్ని వ్యవస్థలనూ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది, మనందరం ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోమనం అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఎన్నికల్లో ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది”అని డి.రాజా అన్నారు. “దేశం చాలా సంక్లిష్టదశలో ప్రస్తుతం ప్రయాణం చేస్తోంది, దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సంక్షోభాలు నెలకుని ఉన్నాయి, కానీ కేంద్రంలోని ప్రభుత్వం మాత్రం దేశ సమస్యలను పెడచెవిన పెడుతున్నది, మానవ అభివృద్ధి సూచికల ప్రకారం భారత్‌ అన్ని దేశాలకంటే అట్టడుగున ఉంది ప్రైవేటీకరణే నరేంద్రమోడీ ప్రభుత్వ ఆర్థిక విధానంగా మారిపోయింది, అదానీ సమస్యపై పార్లమెంటులో కనీస చర్చకు కూడా బిజెపి ప్రతిపక్షాలను అనుమతించలేదు, ఈ సమస్యపై దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రతిపక్షాల డిమాండ్‌ను సమ్మతించలేదు” అని రాజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధనా సంస్థ గడచిన జనవరిలో అదానీని బోనులో నిలబెడుతూ ఒక నివేదిక విడుదల చేసింది, స్టాక్‌లను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని రకాల అడ్డదారుతూ అదానీ గ్రూపు అనుసరించిందని ఆ నివేదిక వెల్లడించింది, దశాబ్దాలుగా మోసాలకు పాల్పడిందని వెల్లడించింది, అయినాగానీ అదానీ గ్రూపు ఆ నివేదిను వట్టి చెత్త అంటూ కొట్టిపారేసింది” అని విమర్శించారు.
దొడ్డిదారిన అధికారం కోసమే
అర్డినెన్స్‌ తెచ్చారు

ఢిల్లీలో పరిపాలనా సేవలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అర్డినెన్స్‌పై రాజా మాట్లాడుతూ, “ఈ సమస్యపై శుక్రవారంనాడు పాట్నామీట్‌లో చర్చించాం, కాంగ్రెస్‌పార్టీ సహా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఈ అర్డినెన్స్‌ను వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నుండి అధికారాలను దొడ్డిదారిన స్వాధీనం చేసుకోవడానికే ఈ అర్డినెన్స్‌ తెచ్చారు, దీనిని మేం అందరం వ్యతిరేకిస్తున్నాం” అన్నారు. అదేవిధంగా మణిపూర్‌ సమస్యపై హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సిపిఐని పిలవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సమస్యలు పట్టని ప్రభుత్వ మొండివైఖరికి ఇది ఒక తార్కాణమని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం మతోన్మాద రాజకీయాలు చేయడంలో తలమునకలైపోయి ఉన్నారు, విద్వేషాన్ని దేశమంతటా వ్యాప్తి చేయడంలో తలమునకలై ఉన్నారని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments