వామపక్షాల పిలుపు
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని ప్రజలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి ఈ మేరకు సిపిఐ, సిపిఐ (ఎం), సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌లు బుధవారంనాడొక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. కొవిడ్ 19 ప్రబలిన తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో వ్యాధిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టి, ప్రజలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ కాలంలో భారత రాజ్యాంగ విలువలను, సిద్ధాంతాలను తీవ్రంగా తొక్కిపెట్టిందని, ముస్లిమ్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ మత విభజనవాదానికి పాల్పడిందని వామపక్షాల నేతలు డి.రాజా (సిపిఐ), సీతారాం ఏచూరి (సిపిఐ(ఎం), దేబబ్రత బిశ్వాస్ (ఎఐఎఫ్‌బి), దీపాంకర్ భట్టాచార్య (సిపిఐ(ఎంఎల్) లిబరేషన్), మనోజ్ భట్టాచార్య (ఆర్‌ఎస్‌పి)లు విమర్శించారు. పార్లమెంటు మొదలుకొని న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, సిబిఐ, ఇడి…ఇలా ప్రతి ఒక్క రాజ్యాంగ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తిని తుంగలోతొక్కి, వాటిపై దాడి చేసిందని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగ పరిరక్షణలో ఇవేవీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయని, ప్రభుత్వమే ఆ పరిస్థితిని కల్పించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, పౌరస్వేచ్ఛకు తీవ్రమైన ముప్పు ఏర్పడిందని, ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఏ మాత్రం భావప్రకటన చేసినా అది జాతివ్యతిరేకంగా
ముద్రవేస్తూ వచ్చిందని, యుఎపిఎ, దేశద్రోహం వంటి రాక్షస చట్టాల కింద ఎంతోమంది హక్కుల కార్యకర్తలు, మేధావులను అరెస్టు చేసిందని గుర్తు చేశారు. అధికారాలను పూర్తిగా కేంద్రీకరించి, సామాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ మౌలిక లక్షణానికే సర్కారు తూట్లు పొడిచిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని పటిష్టవంతం చేసుకొని, ప్రజల హక్కులు కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, అందుకే పంద్రాగస్టు రోజున ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.
అమెరికా కుట్రలపై సెప్టెంబరు 1న నిరసన
అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తూ, ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ను ఒక పావులా వాడుకుంటున్నదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమెరికాకు పూర్తిగా పాదాక్రాంతమైపోయిందని వామపక్ష నేతలు విమర్శించారు. ఈ తరహా విధానం భారత ప్రజల ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని, భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని అభిప్రాయపడ్డారు. మోడీ తప్పుడు విదేశాంగ విధానాన్ని సరిచేయాల్సిన సమయం వచ్చిందని, భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అమెరికా లేదా అమెరికా-ఇజ్రాయిల్ కూటమి విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజలు సెప్టెంబరు 1వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనల ద్వారా తమ వ్యతిరేకతను ప్రదర్శించాలని కోరారు.
రాజ్యాంగ పరిరక్షణ దినంగాపంద్రాగస్టు
RELATED ARTICLES