10న విచారణ ప్రారంభం
ఐదుగురు సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు
న్యూఢిల్లీ : అయోధ్య కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఏర్పాటు చేసింది. కేసు విచారణను ఈనెల 10వ తేదీన చేపట్టనున్నారు. రామ్‌జన్మభూమి-బాబ్రీ మసీదు భూయాజమాన్య వివాద కేసు విచారణ కోసం ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు. మిగతా సభ్యుల్లో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లు వున్నారు. దీనికి సంబంధించిన నోటీసును సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. “అయోధ్య భూవివాద కేసుకు సంబంధించిన అంశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీదట చీఫ్ జస్టిస్‌తోపాటు బాబ్డే, రమణ, లలిత్, చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పా టు చేయడం జరిగింది. ఈ ధర్మాసనం జనవరి 10వ తేదీ గురువారం ఉదయం10.30 గంటలకు ఈ కేసు విచారణ చేపడుతుంది”అని సుప్రీంకోర్టు తన నోటీసులో పేర్కొంది. ఈ కేసు విషయంలో తదుపరి ఉత్తర్వులను దీనికి సంబంధించి ఏర్పాటయ్యే ధర్మాసనం పదవ తేదీన వెలువరుస్తుందని ఈనెల 4వ తేదీనే కోర్టు వెల్లడించిన విషయం తెల్సిందే. అయోధ్యలో 2.77 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖారా, రామ్‌లాలాల మధ్య నడుస్తోంది. దీనికి సంబంధించి నాలుగు సివిల్ దావాలు దాఖలు కాగా 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మూడు పార్టీలకూ భూమిని సమానంగా పంచుతూ తీర్పులో పేర్కొం ది. దీనిపై 14 అప్పీళ్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై పరిశీలిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరు 29న ఒక ప్రకటన చేస్తూ జనవరి మొదటి వారంలో ధర్మాసనం ముందుకు ఈ కేసు వెళ్తుందని పేర్కొంది.
రాజ్యాంగ ధర్మాసనానికి అయోధ్య కేసు
RELATED ARTICLES