న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాం గ్రెస్ ఎంపి అహ్మద్ పటేల్ తెలిపారు. కాం గ్రెస్, టిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, ఆర్‌జెడి టిఎంసి, సమాజ్‌వాది పార్టీ, ఎసిసిపి, ఎన్‌సి, డిఎంకె, ఆప్ పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. రైతు, వ్యవసాయ విధానాలపై ఆదివారం సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నోటీసు ఇచ్చామన్నా రు. దేశ చరిత్రలో ఇదో చీకటి రోజుగా అహ్మద్ పటేల్ అభివర్ణించారు. లోక్‌సభ ఆమోదం పొందిన ’ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. అయితే, సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించడం పట్ల విపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ చైర్మన్ తూట్లు పొడిచారని ఆరోపించాయి. బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమమయంలో సభ రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని అహ్మద్ పటేల్ ఆరోపించారు. సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదని అన్నారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపి డెరెక్ ఓబ్రయిన్ ఆరోపించారు. విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు.
విపక్ష సభ్యుల తీరుపై అసహనం
ఇదిలా ఉండగా, రాజ్యసభలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సహాయ మంత్రులు, రాజ్యసభ డిప్యూటీ నేత పీయూష్ గోయల్, ఇరుసభల ఉన్నతధికారులు హాజరయ్యారు. కీలకమైన వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకురావడం వంటి సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. డిప్యూటీ చైర్మన్ మైక్ లాగేందుకు ప్రయత్నించడం, బిల్లు ప్రతులను చించివేయడం వంటి ఘటనలకు పాల్పడిన సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సభా సమయం తగ్గించే అంశాన్ని ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం!
RELATED ARTICLES