న్యూఢిల్లీ: దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. నోటిఫికేషన్ మార్చి 6న వెలువడనుంది. 17 రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరగనున్న 55 స్థానాల్లో 51 సీట్లకు ఏప్రిల్‌లో వేర్వేరు తేదీల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి. సిట్టింగ్ సభ్యులు పదవీ విరమణ పొందనున్నారు. అదే విధంగా మరో నాలుగు స్థానాల్లో సభ్యులు రాజీనామా చేయడంతో ఇప్పటికే అవి ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇటీవల రాజీనామా చేసిన సభ్యుల పదవి కాలం కూడా ఏప్రిల్‌లోనే ముగియనుంది. కాగా, రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లు వేసేందుకు మార్చి 13 వరకు తుది గడువుగా విధించారు. మార్చి 26న ఎన్నికలు ముగియగానే ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. పదవీ విరమణ పొందే ప్రముఖుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ (జెడియు), కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలె (ఆర్‌పిఐ అథవాలె), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా, కేంద్ర మాజీమంత్రులు విజయ్ గోయల్ (బిజెపి), కుమారి సెల్జా (కాంగ్రెస్), మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌లు ఉన్నారు. మహారాష్ట్రలో ఏడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా, తమిళనాడులో ఆరు, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో ఐదేసి చొప్పున, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురేసి చొప్పున, అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ముగ్గురేసి చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్‌లో ఇద్దరేసి చొప్పున, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో ఒక్కరేసి చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. అధికార బిజెపి, ప్రతిక్ష కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెల్చుకోనున్నాయి. అయినప్పటికీ రెండు పార్టీల బలం స్వల్పంగా తగ్గనుంది. 245 సభ్యులుగల రాజ్యసభలో మార్చి 26న జరిగే ఎన్నికల తరువాత తృణమూల్ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల బల గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కె.కేశవరావు, ఎంఎ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, తెలంగాణలో కెవిపి రామచంద్రరావు, గరికపాటి రాంమోహన్‌రావు పదవీ కాలం ముగుస్తుంది.
రాజ్యసభ ఎన్నికల నగారా
RELATED ARTICLES