విశాఖలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం
ప్రజాపక్షం/ విశాఖపట్నం : దేశంలో రాజకీయ ప్రత్యామ్నా యం అత్యవసరమని సిపిఐ అభిప్రాయపడింది. సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మంగళవారం విశాఖపట్నంలోని అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ప్రారంభమయ్యా యి. ఈ సమావేశాలు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ముందుగా మంగళవారంనాడు కార్యవర్గ సమావేశం జరిగింది. ఏపీ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో బిజెపికి భంగపాటు కలిగిందని, ఆ రాష్ర్ట ప్రజలు బిజెపిని ఓడించి దేశానికి మేలు చేసారని కార్యవర్గ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అలాగే ఈ సమావేశంలో రాజకీయ నివేదికపై కార్యవర్గం చర్చించింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నిరంకుశ వైఖరిపై జాతీయస్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయంపై చర్చించామన్నారు. ఈ జాతీయ సమితి సమావేశాల్లో రాబోయే 2019 ఎన్నిక ఎత్తుగడపై చర్చిస్తామని నారాయణ చెప్పారు. దేశాన్ని కాపాడేందుకు బిజెపిని ఓడించి దేశానికి మేలు జరిగిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో వామపక్షాలకు నష్టం జరిగినా దేశానికి మేలు జరిగిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తీర్పులతో బిజెపికి భంగపాటు తప్పదన్నారు. నోట్ల రద్దుతో చిన్నాభిన్నమైన ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు బిజెపి నిష్క్రమణ అనివార్యమని తెలిపారు. సిబిఐని, ఆర్బిఐని ఎన్నికల కమిషన్ను ధ్వంసం చేసిన మోడీ న్యాయవ్యవస్థకు కళ్లకు గంతలు కడుతున్నారన్నారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేసారు.