పియుసిఎల్ రాష్ట్ర మహాసభలో వక్తల వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి జరగలేదని పలువురు వక్తలు అన్నారు. పౌర హక్కుల ప్రజా సంఘం (పియుసిఎల్) రాష్ట్ర మహాసభలు శనివారం హైదరాబాద్ ఎ.వి.కళాశాల ప్రాంగణంలో జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జిలు జస్టిస్ నవ మోహన్‌రావు, జస్టిస్ గోపాల్ సింగ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు, ‘ప్రజాపక్షం’ సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, పియుసిఎల్ ప్రతినిధులు చంద్రశేఖర్‌రావు, బాలకిషన్‌రావు, జయ వింద్యాల, దామోదర్‌రెడ్డి, ఇక్బాల్ ఖాన్‌లు ప్రసంగించారు. బలహీనుల భూములు కబ్జాలకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలని సభ తీర్మానించింది. జస్టిస్ నవ మోహన్‌రావు మాట్లాడుతూ మానవ హక్కుల ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా సాగాలన్నారు. ఇందిరా గాంధీ ఏమర్జెన్సీ విధించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, మేధావులు మానవహక్కుల ఉద్యమంలో పనిచేశారని గుర్తు చేశారు. మనిషిని మనిషిగా చూడని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను అధికార పార్టీ చేస్తే, ఆ చట్టాలను ప్రభుత్వ ఏజెన్సీలు అమలు చేయడం లేదని, రాజకీయ నాయకులు చెప్పింది మాత్రమే చేస్తున్నారని అన్నారు. పోలీసులు కేసులు రిజిస్టర్ చేయడం లేదని, బాధితులు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పియుసిఎల్ స్వేచ్ఛగా పనిచేయాలని, అన్ని రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. భూ సమస్యలు చాలా వస్తున్నాయన్నారు. భూదాన్ భూములకు సంబంధించిన రికార్డులు మండల, ఆర్‌డిఓ కార్యాలయాల్లో నిర్వహించడం లేదన్నారు. పాత రికార్డులను మార్చి, వాటిలో కబ్జాదారుల పేర్లు చేర్చారని ఆరోపించారు. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 2వేల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయని తెలిపారు. జస్టిస్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ గర్భంలో ఉన్న శిశువు నుంచి మనిషి శ్మశానం చేరే వరకు మానవ హక్కులు అమలు కావాలన్నారు. పియుసిఎల్ ఉద్యమానికి ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భావాలు వెల్లడించడానికి హక్కులు లేవని, భవిష్యత్‌లో ఇంటి నుంచి బయటకు రావాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. హక్కుల కోసం జరిగిన ఆందోళనలతో దేశం 70 ఏళ్లు వెనక్కి పోయిందని సాక్షాత్తు ప్రధాని మోడీ వాఖ్యనించారని తెలిపారు. హక్కులతో అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. గుజరాత్ ఎన్నికల్లో దేశ హోంమంత్రి అమిత్‌షా తాము 80 శాతం మంది ప్రజలకు రక్షకులమని అన్నారని, మరి 20 శాతం ప్రజలు ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం అశ్చర్యం కలిగించిందన్నారు. గుజరాత్‌లో ఒక్క ముస్లింకు కూడా ఎంఎల్‌ఎ టిక్కెట్ ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ‘బ్లాక్‌డే’ అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆర్గనైజర్ పత్రిక బ్యానర్ రాసిందని గుర్తు చేశారు. పెగాసెస్‌పై పార్లమెంట్‌లో చర్చించలేదని, రాజ్యసభలో చర్చించకు పెట్టాలని కోరితే అనుమతి ఇవ్వలేదన్నారు. వర్కింగ్ జర్నలిస్టు యాక్టు ఉందని, స్వాతంత్య్ర భారతంలో మూడు సార్లు మాత్రమే వేజ్ బోర్డు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న వేజ్ బోర్డు 15 సంవత్సరాల కిందట వచ్చిందని, 22 శాతం మాత్రమే వర్తిస్తుందన్నారు. పత్రిక వ్యవస్థను కూడా రాజ్యాంగంలో పొందుపరిస్తే మిగిలిన మూడు వ్యవస్థలపై ప్రభుత్వానికి ఏ విధంగా నియంత్రణ ఉందో అదే మాదిరిగానే ఉండేదని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత సిఎం కెసిఆర్ రాజకీయ వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కేశారని అన్నారు. బ్రాహ్మనందరెడ్డి లాంటి వాళ్లు ఇలాగే పరిపాలిస్తే తరువాత పరిస్థితి ఏమైందో అందరికి తెలుసునని అన్నారు. జయ వింధ్యాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి జరగలేదని, అందుకు మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ ఒక ఉదాహరణ అన్నారు. అకారణంగా పోలీసులు వ్యక్తులను 24 గంటలకు మించి పోలీస్ స్టేషన్‌లలో విచారణ పేరుతో బంధించి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాలుపడుతున్నారన్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళను 3 రోజులు నిర్బంధించి ఉంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. కామారెడ్డి జిల్లాలో పంటను ఆరబెట్టుకుంటున్న ఓ రైతును పొలీసులు కొట్టిచంపారని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఒక గిరిజన యువకుడిని దారుణంగా హింసించారన్నారు. బలహీనుల భూములను లక్కుంటున్నారని, దీన్ని వ్యతిరేకించిన వారిని బలవన్మరణాలకు పురిగొల్పుతున్నారన్నారు. బాలకిషన్ రావు మాట్లాడుతూ తండ్రి భూమి కుమారుని పేరుపై మార్చుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒకరి భూమి మరొకరి పేరుపై రాస్తున్నారని, సామాన్యుల భూములు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. సామాన్యుల భూ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పియుసిఎల్‌పై ఉందన్నారు. ఈ మహాసభలలో పియుసిఎల్ పి.జె.సూరి, రియాజుద్దీన్, సలాఉల్లాఖాన్, దయానంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా మానవ హక్కుల ఉద్యమం
RELATED ARTICLES