HomeNewsBreaking Newsరాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం

రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం

కన్హయ్య దేశద్రోహం కేసుపై సిపిఐ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, జెఎన్‌యు స్టూడెంట్స్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షులు కన్హయ్యకుమార్‌పై బనాయించిన దేశద్రోహం కేసు విషయంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా తమ పార్టీ రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటుందని సిపిఐ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శివర్గం శనివారంనాడొక ప్రకట న విడుదల చేసింది. కన్హయ్యపై మోపిన అభియోగాలు తప్పుడు, రాజకీయ దురుద్దేశపూరితమైనవ ని, అందువల్ల అతను నిర్దోషిగా బయటపడతాడన్న విశ్వాసం తమ పార్టీకి వుందని స్పష్టం చేసిం ది. అయితే అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, కన్హయ్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేయడం దురదృష్టకరమని సిపిఐ అభిప్రాయపడింది. కన్హయ్యపై ఎలాంటి దేశద్రోహం కేసులేదని, వీడియోలను మార్ఫింగ్‌ చేశారని కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గతం లో స్వయంగా ప్రకటించిన విషయాన్ని సిపిఐ గుర్తు చేసింది. ఉన్నట్టుండి కేజ్రీవాల్‌లో ఈ మార్పు ఎందు కు వచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. కన్హయ్య ప్రాసిక్యూషన్‌కు ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అనుమతినివ్వలేదని తమ పార్టీ అర్థం చేసుకోగలదని పేర్కొంది. తమ వాదనను నిరూపించుకునేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ సిఫార్సుల పత్రాన్ని త్వరలోనే మీడియాకు విడుదల చేస్తామని తెలిపింది. కన్హయ్యపై బనాయించిన తప్పుడు కేసును తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని, ఈ చర్యల ను ఖండిస్తూ పార్టీ శాఖలు, ప్రజాసంఘాలు శాంతియుతంగా నిరసనలు తెలియజేయాల్సిందిగా సిపిఐ కార్యదర్శివర్గం ఆ ప్రకటనలో పిలుపునిచ్చింది.
కేజ్రీవాల్‌ వివరణ ఇవ్వాలి : కన్హయ్యకుమార్‌పై బనాయించిన దేశద్రోహం కేసులో ప్రాసిక్యూషన్‌కు ఏ కారణాలతో, ఏ ఒత్తిళ్లతో అనుమతినిచ్చారో ఢిలీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వివరణ ఇవ్వాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్‌ చేశారు. కోయంబత్తూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2016లో కేసును పెట్టినప్పుడే వీడియోలను మార్ఫింగ్‌ చేశారని కేజ్రీవాల్‌ స్వయంగా అన్నారని గుర్తుచేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే కన్హయ్యపై కేసు బనాయించారని, రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా వుందని వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలను ప్రస్తావించగా, ఈ హింసాకాండకు పూర్తిగా బిజెపియే కారణమని, 2002 గుజరాత్‌ తరహా అల్లర్లకు ఇది ప్రతిరూపమని, అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా అనుసరిస్తున్నదని ఆరోపించారు. దేశంలో అశాంతిని నెలకొల్పడమే సంఘ్‌శక్తుల టార్గెట్‌ అని విమర్శించారు. మతపరంగా దేశంలో విభజనరేఖ గీయడానికి ఆ శక్తులు నానా తంటాలు పడుతున్నాయని అన్నారు. ఆప్‌ మాజీ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై వచ్చిన ఆరోపణల గురించి అడగ్గా, పూర్తి విచారణ జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయన్నారు. పౌరసత్వ సవరణ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకమైనదన్న ఆపోహ వుందని, నిజానికి ముస్లిమ్‌లతోపాటు పేదలు, దళితులు, అట్టడుగు ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన కేవలం అమెరికాకు మాత్రమే ఉపయోగమని, దీని వల్ల భారత్‌కు ఒరిగేదేమీ లేదని అన్నారు. భారత్‌లో ఉన్న విస్తృతమైన మార్కెట్‌ను హస్తగతం చేసుకోవడమే అమెరికా లక్ష్యమని రాజా అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments