HomeNewsBreaking Newsరహదారి భద్రతా చట్టం అమలును ఆపకపోతే ప్రగతి భవన్‌ ముట్టడిస్తాం

రహదారి భద్రతా చట్టం అమలును ఆపకపోతే ప్రగతి భవన్‌ ముట్టడిస్తాం

తెలంగాణ రాష్ర్ట ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జెఎసి అల్టిమేటం
ట్రాన్స్‌ పోర్ట్‌ భవన్‌ ముట్టడించిన డ్రైవర్లు, కార్మికులు
ఖైరతాబాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ దగ్గర నెలకొన్న ఉద్రిక్తత
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రహదారి భద్రత చట్టం అమలును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు గురువారం తమ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి బంద్‌ నిర్వహించారు. డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు రాస్తా రోకోను నిర్వహించి రహదారి భద్రత చట్టంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల కొత్త చట్టాలు తీసుకువస్తూ ఇప్పటికే కరోనాతో చితికిపోయిన పేద కుటుంబాలైన డ్రైవర్ల జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయని జెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి భద్రత చట్టం అమలును వెంటనే నిలిపివేయనట్లయితే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని జెఎసి నేతలు హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ ముట్టడి
రవాణ రంగ కార్మికుల నడ్డివిరుస్తున్న రహదారి భద్రత చట్టం అమలును ఆపకపోతే ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని తెలంగాణ రాష్ర్ట ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జెఎసి కన్వీనర్‌ బి.వెంకటేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రహదారి భద్రత చట్టం అమలును రాష్ర్ట ప్రభుత్వం వెంటనే ఆపాలని, ఫిట్నెస్‌ లేని ఆటోలకు రోజుకు రూ.50 జరిమానా విధింపు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ర్ట వ్యాప్తంగా ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జెఎసి ట్రాన్స్‌ పోర్ట్‌ బంద్‌ నిర్వహించింది. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ను గురువారం వేలాదిమంది రవాణ రంగ కార్మికులు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తరలించారు. ఈ సందర్భంగా ఆందోనళకారులు, పోలీసుల మధ్య పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది. జెఎసి నేతలు బి.వెంకటేశం, ఆర్‌.మల్లేష్‌(ఎఐటియుసి), ఎ.సత్తిరెడ్డి(టిఎడిఎస్‌), వేముల మారయ్య(టిఆర్‌ఎస్‌ కెవి), జి.మల్లేష్‌ గౌడ్‌(ఐఎన్‌టియుసి), ఎం.డి.అమానుల్లా ఖాన్‌(టిఎడి జెఎసి), కిరణ్‌(ఐఎఫ్‌టియు), శ్రీకాంత్‌(సిఐటియు), క్యాబ్‌ జెఎసి నాయకులు రాజశేఖర్‌రెడ్డి, సలావుద్దీన్‌, సతీష్‌, రాజు గౌడ్‌, గడుసు శ్రీనివాస్‌(టిఆర్‌ఎస్‌ కెవి)లు ముట్టడి కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ సందర్బంగా వెంకటేశం మాట్లాడుతూ రహదారి భద్రత చట్టంలో భాగంగా ఫిట్నెస్‌ లేని ఆటోలకు రోజుకు రూ.50 జరిమానా విధించి ఆటో డ్రైవర్ల కడుపుకొడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రహదారి భద్రత చట్టం రద్దు చేయాలన్నారు. దీనిని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేయవద్దని, ఫిట్నెస్‌ లేని ఆటోలకు రోజుకు విధిస్తున్న రూ.50 జరిమానాలు వెంటనే రద్దు చేయాలని వెంకటేశం డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పూర్తి స్థాయిలో పెరగడంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన అమ్మకాలను వెంటనే జిఎస్‌టి పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్‌ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే స్పందించి నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలను దష్టిలో ఉంచుకుని కనీస ఛార్జీని రూ.20 నుండి రూ.40కి పెంచాలని, కిలోమీటరు ఛార్జీని రూ.11 నుండి రూ.25కి పెంచాలని కోరారు. గత ఎనిమిదేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంపై రాష్ర్ట ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో నిరుద్యోగులైన బడుగుబలహీన వర్గాలకు ఉపాధి కోసం పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలని కోరారు. భరించలేని ఇన్సూరెన్సు ధరలు తగ్గించాలన్నారు. ఆటో, ట్రాలీ, క్యాబ్‌, లారీ, ప్రైవేట్‌ బస్సు కార్మికులందరిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments