పాలు కలుషితం.. పశువుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం, పశు సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలోనూ ఈ రెండు రంగాలే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం విజయ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలు జరుపుతోంది. అంటే మన రాష్ట్రంలో పాలు, పాల పరిశ్రమ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. పాల విక్రయాల ద్వారా రైతులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. పాలను వినియోగించని వారుండరు. రాష్ట్రం కాదు, మన దేశం కూడా ప్రపంచంలోనే 15శాతం పశుసంపదను కలిగి ఉంది. అధికశాతం రైతులు సంప్రదాయ పద్ధతిలో పశువులను ఊరి బయటకు తోలుకువెళ్లి మేపుతుంటారు. అయితే పాల వినియోగం పెరగడం, ఆరుబయటకు తీసుకువెళ్లి మేపే పరిస్థితులు లేకపోవడం, మేత విషయంలోనూ ఆధునిక పద్ధతులు, సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ సంప్రదాయం క్రమేపి తగ్గుతోంది. మేపే విషయంలో ఎలాంటి పద్దతులు పాటించినప్పటికి పశువుల్లోకి రసాయనాలు వెల్లకుండా జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రసాయనాలు పశువుల శరీరంలోకి వెల్లడం వల్ల పాలు కలుషితం కావడంతో పాటు పశువులు కూడా అనారోగ్యం పాలవుతాయని చెబుతున్నారు. ఈ పాలు త్రాగడం వల్ల మనుషులు కూడా అనారోగ్యం పాలవుతారు. ఇన్ని అనర్థాలు ఉన్నందున రసాయనాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. రసాయనాలు ప్రధానంగా పశుగ్రాసం ద్వారానే పశువులకు చేరుతాయి. ప్రధానంగా పప్పు జాతి పశుగ్రాసాల వేర్లకు బుడిపెలు ఉంటాయి. వీటిలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకుని మొక్కలకు అందిస్తుంది. ఇలాంటి పశుగ్రాసాల పెంపుకు రసాయనాలను వాడితే నత్రజనిని తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. రసాయనిక ప్రక్రియ వల్ల కీడు చేసే బ్యాక్టీరియా పశుగ్రాసాల్లో ఆఫ్లాటాక్సిన్స్, జీరాలినోన్స్, వామిటాక్సిన్స్ వంటి శిలీంధ్రాలను పెంచుతాయి. ఈ పశుగ్రాసాన్ని పశువులు తీసుకుంటే పశువుల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పశువులు ముఖ్య అవయవాలు పాడుకావడం, పశువుల ఉత్పాదకత తగ్గిపోవడం, వ్యాదుల బారిన పడడం జరుగుతుంది. పశువుల్లోకి రసాయనాలు ఇంకా అనేక మార్గాల్లో ప్రవేశిస్తాయని అధికారులు చెపుతున్నారు. పశువులను బాహ్య పరాన్న జీవుల నుంచి నియంత్రించడానికి వాటి శరీరంపై రసాయనాలు పిచికారీ చేస్తారు. పొరపాటును పశువులు వాటిని నాకడం ద్వారా కూడా రసాయనాలు వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే రసాయనాలతో సాగైన దాణా పదార్థాలైన పత్తి గింజల చెక్కలు, ధాన్యాలు, తవుడు, పప్పుదినుసులు వీటి యొక్క ఉప ఉత్పత్తులు వాడడం ద్వారా రసాయన అవశేషాలు పశువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే స్థానిక మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయల వృధా పదార్థాలను మేయడం వల్ల కూడా రసాయన అవశేషాలు పశువుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలా కలుషితమైన మేత తిన్న పశువుల పాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ప్రపంచ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం పాలలో శిలీంద్రాలు 0.5 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. భారతీయ ఆహార భద్రతా సంస్థ నిర్వహించిన సర్వేలో చాలా పాల నమూనాల్లో ఈ శిలీంద్రాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పాలు కాలేయాన్ని దెబ్బతీయడంతో పాటు కాన్సర్‌కు కారణమవుతుంది. ఇలాంటి పాలను ఎంత సేపు మరగబెట్టినప్పటికి శిలీంద్రాలు నాశనం కావు. అందుకే ముందుగానే రసాయనాల బారినుంచి పశువులను కాపాడుకోవాలి అంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు.
రసాయనాలతో తస్మాత్ జాగ్రత్త
RELATED ARTICLES