HomeNewsBreaking Newsరష్యా ప్రయోగం విఫలం..

రష్యా ప్రయోగం విఫలం..


చంద్రుడిపై కూలిపోయిన ‘లూనా-25’!

చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన ల్యాండర్‌
వెల్లడించిన రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌
మాస్కో:
చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన ‘లూనా-25’ ప్రయోగం చివరి క్షణంలో విఫలమయ్యింది. జాబిల్లిపై అడుగు పెట్టడానికి ముందే ల్యాండర్‌ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ ’రోస్‌ కాస్మోస్‌’ అధికారికంగా వెల్లడించింది. అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం అది కూలిపోయినట్లు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరినట్లయ్యింది. ‘జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్‌, అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది’ అని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ ప్రకటించింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా పంపిన ఈ ల్యాండర్‌ 21వ తేదీన దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి లూనా -25 శనివారం కీలక చర్యను చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రోస్‌ కాస్మోస్‌ గుర్తించింది. అప్పటికే వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, లూనా-25 ని ఈ నెల 11న రష్యాలోని స్ట్రోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. సుమారు పదిరోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్‌ ఆదివారం కూలిపోవడానికి కొన్ని గంటల కింద చంద్రుడి ఫొటోలనూ పంపించింది. మరికొన్ని గంటల్లోనే అక్కడ దిగేందుకు సిద్ధమైన సమయంలో అది క్రాష్‌ అయ్యింది. మరోవైపు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ ఈ నెల 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనున్నట్లు ఇస్రో అంచనా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments