నాగార్జున సాగర్ కింద ఆరు లక్షల ఎకరాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు
ఆరు నుంచి ఏడు తడుల వరకు సాగు నీరందించనున్న నీటిపారుదల శాఖ
ప్రజాపక్షం/హైదరాబాద్: ఈసారి ఖరీఫ్‌లోనే కాదు నడుస్తున్న రబీలోనూ రైతుల ఇంట సిరుల పంట పండనుంది. ఈసారి రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా రబీలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 11లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించనుంది నీటిపారుదల శాఖ. ఈ మేర కు ప్రణాళికలు తయారుచేసి ఈ నెల మొదటి వారం నుంచే అమలు చేస్తున్నారు. ఈ రబీలో సాగుభూములకు ఆరు నుంచి ఏడు తడుల వరకు సాగు నీరందించనున్నారు. సిద్ధం చేసిన ప్రణాళిక మేరకు నాగార్జున సాగర్ కింద ఆరు లక్షల ఎకరాలు సాగునీరందించాలని నిర్ణయించారు. అయితే ఈసారి వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో ఆరున్నర లక్షల ఎకరాల వరకు సాగునీరందించే అవకాశాలు ఉన్నాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా మునుపెన్నడు లేని విధంగా జలకలతో ఉట్టిపడుతుండడంతో ఈసారి రబీలో దీని కింద లోయర్ మానేరు డ్యాం వరకు, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా కలుపుకుని మొత్తం ఐదు లక్షల ఎకరాల వరకు సాగునీరందించనున్నారు. సాగర్, శ్రీరాంసాగర్‌ల ద్వారానే మొత్తం 11లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమికి సాగునీరందించనున్నారు. నాగార్జున సాగర్ విషయానికి వస్తే దీని పూర్తి స్థాయి నీటి మట్టం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం దాదాపు 300టిఎంసిల నీరు ఉంది. దీని కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం దీనికి దాదాపు 170 అడుగుల ఎగువ వరకు నీళ్లు ఉన్నాయి. నాగార్జున సాగరే కాకుండా ఎగువ శ్రీశైలంలోనూ కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా ప్రస్తుతం దీనికంటే 135 అడుగుల ఎగువ వరకు నీళ్లు ఉన్నాయి. అంటే సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను రెండింటిని కలుపుకుంటే మొత్తం దాదాపు 310 టిఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు 140 టిఎంసీల మేర నీటి వాటా దక్కనుంది. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ త్రాగునీటి అవసరాలకోసం ఏపి, తెలంగాణలు అడిగిన దాని కంటే కూడా ఎక్కువ నీటిని కేటాయించిన విషయం తెలిసిందే. సాగు నీటి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో దీని కింద రబీలో సాగుకు ఢోకా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 140 టిఎంసీలనే కేటాయించినా… దీనిలో కల్వకుర్తి నీటి అవసరాలకు 35 టిఎంసీలను పక్కన పెట్టాల్సి వస్తుంది. దీంతో పాటు సాగర్ కింద త్రాగునీటి అవసరాలను పక్కన పెడితే కనీసం 50 టిఎంసీల నీరు సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ 50 టిఎంసీలతో సాగర్ కింద దాదాపు 6.50లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశాలు ఉన్నాయి. కారణం గతేడాది రబీలో సాగర్ కింద సాగునీటి అవసరాల కోసం 27.39 టిఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండగా ఆన్ అండ్ ఆఫ్ పద్దతిన 4.15లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈసారి దాదాపుగా రెట్టింపు నీరు ఉండడంతో అధికారులు వేస్తున్న అంచనాల మేరకు ఆరున్నర లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే దీని పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.031 టిఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 83 టిఎంసీలకు పైగా నీరుంది. దీని కింద మొత్తం 9.68లక్షల ఎకరాలకు రబీలో సాగునీరందించాల్సి ఉంది. ఈనీటితో పాటు ఎల్‌ఎండి కింద సాగు కోసం ఈ సారి కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.