మెట్టు దిగని కేంద్రం 8వ దఫా చర్చలు విఫలం
15న మరోసారి చర్చలు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
న్యూఢిల్లీ: ప్రభుత్వం, నిరసన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులకు మధ్య శుక్రవారం జరిగిన ఎనిమిదో విడత చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిశాయి. తర్వాత సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుందని సమాచారం. చట్టాలు వెనక్కి తీసుకుంటేనే (లా వాపసీ) తాము ఇళ్లకు తిరిగి వెళ్తామని (ఘర్ వాపసీ) తమ ప్రధాన డిమాండ్‌కు రైతు నాయకులు అంటి పెట్టుకోగా, ప్రభుత్వం మాత్రం చర్చలు వివాదాస్పద క్లాజులకే పరిమితం కావాలని, చట్టాలను పూర్తిగా రద్దుచేయలేమని తేల్చిచెప్పింది. అయితే సమావేశంలో చర్చలు అంతగా జరగలేదని, ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు విచారణ ఉండటంతో తర్వాత తేదీని నిర్ణయించారని తెలిసింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన ఇతర అంశాలతోపాటు, మూడు చట్టాల చట్టబద్ధత గురించి సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 41 రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన ఎనిమిదో విడత చర్చల్లో చట్టాలను వెనక్కి తీసుకోలేమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ సంస్కరణలను వివిధ రాష్ట్రాల్లోని పెద్దమొత్తంలో రైతులు స్వాగతించారని, దేశ ప్రయోజనాల దృష్టితో ఆలోచించాలని ప్రభుత్వం రైతు సంఘాలను కోరింది.
కేంద్రం జోక్యం వద్దు
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, వాణిజ్య, ఆహార మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే వేలాది మంది రైతులు ఈ చట్టాలు కార్పొరేట్ అనుకూలమని, ప్రసుత్తం ఉన్న మండీ, కనీస మద్దతు ధర విధానాలకు వ్యతిరేకమని ఢిల్లీ సమీపంలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు. చట్టాల మీద చర్చలకు రావాలని తోమర్ రైతు సంఘాలకువిజ్ఞప్తిచేశారు. అయితే రైతు నాయకులు మాత్రం కొత్త చట్టాలను విరమించుకోవాలన్న డిమాండ్‌నే పునరుద్ఘాటించారని సమాచారం. దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలు కాపాడతామని వ్యవసాయ మంత్రి స్పష్టంచేశారు. “మీరు చట్టాలను వెనక్కి తీసుకుంటేనే (లా వాపసీ) మేం ఇళ్లకు తిరిగి వెళ్తాం(ఘర్ వాపసీ)” అని సమావేశంలో ఒక రైతు నాయకుడు స్పష్టంచేశారు. “వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోని అంశమని సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులు ప్రకటించాయి. కనుక వ్యవసాయ సంబంధ అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. చాలా రోజులుగా చర్చలు సాగుతూనే ఉన్నాయంటే మీరు (ప్రభుత్వం) సమస్యను పరిష్కరించాలని అనుకోవడం లేదనిపిస్తోంది. అలాగైతే, ఏ విషయం అనేది స్పష్టంచేస్తే మేం వెళ్లిపోతాం. అందరి సమయం ఎందుకు వృథా చేస్తున్నారు” అని మరో రైతు నాయకుడు సమావేశంలో అభిప్రాయపడ్డారు.
విజయమో వీరస్వర్గమో
చట్టాలను రద్దు చేసేది లేదని ప్రభుత్వం రైతు సంఘాలకు స్పష్టం చేసినట్లు సమావేశం దగ్గరే ఉన్న ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) సభ్యులు కవితా కురుగంటి తెలిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో రైతు సంఘాల నాయకులు “జీతేంగే యా మరేంగే” (విజయమో వీరస్వర్గమో) అన్న నినాదాలు ఉన్న కాగితాలను పట్టుకొని మౌనంగా ఉన్నారు. దాంతో సమావేశం మొదలైన గంట తర్వాత అంతర్గత సంప్రదింపుల కోసం ముగ్గురు కేంద్రమంత్రులు చర్చల నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇక రైతు నాయకులు భోజన విరామం కూడా తీసుకోకుండా సమావేశం జరిగే గదిలోనే ఉండిపోయారు. సమావేశానికి ముందు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా షాను కలిశారు.
ప్రతిష్ఠాత్మకం కాదు జీవన్మరణ సమస్య
రైతు సంఘాలు చట్టాల రద్దుకే పట్టుపట్టడంతో జనవరి 4 నాడు జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టంభన ముగిసేందుకు ప్రభుత్వం మాత్రం “సమస్యాత్మక” క్లాజుల మీద చర్చ జరగాలి, లేదంటే ఇతర ప్రత్యామ్నాయాలు సూచించాలని కోరుకుంది. అంతకుముందు డిసెంబర్ 30న జరిగిన ఆరో విడత చర్చల్లో దుబ్బుల దహనంలో శిక్షల నుంచి మినహాయింపు, విద్యుత్ సబ్సిడీల కొనసాగింపు విషయంలో రెండు పక్షాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఇక సమావేశానికి ముందు “ఒకవేళ ఈ రోజు పరిష్కారం దొరక్కపోతే, జనవరి 26 నాడు ట్రాక్టర్ ర్యాలీ చేపడతాం” అని కవితా కురుగంటి పేర్కొన్నారు. “మా ప్రధాన డిమాండ్ చట్టాలను విరమించుకోవడమే. ఎలాంటి సవరణలనూ ఆమోదించం. చట్టాలను వెనక్కి తీసుకోకుండా ప్రభుత్వం సమస్యను ప్రతిష్ఠకు సంబంధించిందిగా భావిస్తోంది. కానీ ఇది రైతుల జీవన్మరణానికి సంబంధించిన అంశం. మొదటినుంచి కూడా మా మాటలో మార్పులేదు” అని ఆమె స్పష్టంచేశారు. చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు గురువారం (జనవరి 7) ట్రాక్టర్ ర్యాలీ తీశాయి. అయితే ప్రభుత్వం మాత్రం చట్టాల రద్దు తప్ప ఏ ప్రతిపాదననైనా పరిశీలించేందుకు సిద్ధం అని స్పష్టంచేసింది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చలిని, భారీ వర్షాలను తట్టుకొంటూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ స్థలాల్లో 44 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయం పెంచడంలో భారీ సంస్కరణలని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇవి కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థకు గండికొట్టి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల భయాలు అర్థ రహితం అని, చట్టాలను విరమించుకోలేమని ప్రభుత్వం తెలిపింది. ఇక కొన్ని ప్రతిపక్ష పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు రైతులకు మద్దతుగా వచ్చారు. కొన్ని రైతు సంఘాలు మాత్రం వ్యవసాయ మంత్రిని కలిసి చట్టాలకు మద్దతు ప్రకటించాయి. ఇక ప్రభుత్వం గత నెలలో కొత్త చట్టాల్లో ఏడెనిమిది సవరణలు చేస్తామని, కనీస మద్దతు ధరకు లిఖితపూర్వక హామీ ఇస్తామని రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపించింది.
‘రద్దు’కే ‘రైతు’ పట్టు!
RELATED ARTICLES