న్యూ ఢిల్లీ : ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రజత్ శర్మ రాజీనామాను జస్టిస్ (రిటైర్డ్ బదర్ దుర్రేజ్ అహ్మద్ నేతృత్వంలోని అంబుడ్స్‌మన్ ఆమోదించింది. రజత్ శర్మ రాజీనామాతో పాటు సీఈఓ రవి చోప్రా రాజీనామాని కూడా అంగీకరించింది. డీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ కుమార్ బన్సాల్ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నాయి. ‘రజత్‌శర్మ నుంచి లేఖ అందింది. కొన్ని కారణాల వల్ల నవంబర్ 16న డీడీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని అందులో పేర్కొన్నారు. డీడీసీఏలో పరిస్థితి బాగోలేదని, అధ్యక్ష పదవిలో తాను కొనసాగలేనని తెలిపారు‘ అని అంబుడ్స్‌మన్ పేర్కొంది. అంతకముందు రజత్‌శర్మ రాజీనామాను అంబుడ్స్‌మన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. సస్పెండ్‌కు గురైన డీడీసీఏ కార్యదర్శి వినోద్ తిహారాను తిరిగి నియమించడానికి ప్రస్తుతం అనుమతివ్వట్లేదని ఆయన పేర్కొన్నారు. తమ అనుమతి తేకుండా దీనిపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని డీడీసీఏ అపెక్స్ కౌన్సిల్‌కు తెలిపారు. అనంతరం విచారణను నవంబర్ 27కు వాయిదా వేశారు. కాగా, నవంబర్ 16న రజత్‌శర్మ డీడీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ సంఘంలో పలు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, కొందరు క్రికెట్ ఆటపై కాకుండా స్వార్థపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నిజాయితీ, పారదర్శకతకు విరుద్ధంగా తాను రాజీపడి తన విధానాలకు విరుద్ధంగా పనిచేయలేనని, అందుకే తాను అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సభ్యులకు రాసిన లేఖలో తెలిపారు. 2018 జులైలో రజత్ శర్మ డీడీసీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తాను క్రికెట్ సంఘం బాధ్యతలు చేపట్టినపుడు డీడీసీఏకు ఎలాంటి నిధులు లేవని, తాను దాన్ని రూ.25 కోట్ల కార్పస్ ఫండుగా తయారుచేశానని, ఈ నిధులను క్రికెట్ పురోగతికి వినియోగించాలని రజత్ శర్మ సూచించారు.
రజత్ రాజీనామాకు ఓకే
RELATED ARTICLES