అన్ని పరీక్షలు నెగ్గి విజేతలైనా ఉత్తదేనా
ఉద్యోగం సాధించినా శిక్షణకు దూరం
కాలయాపనతో కానిస్టేబుల్స్ మనోవేదన
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో : రక్షణ వ్యవస్థను మరింత పటిష్ట పరిచే భాగంలో 18వేల పోస్టులు భర్తీ చేసేందుకు గానూ 2018 లో రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్స్ ఎంపిక కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అందులో లక్ష మంది అర్హత గల నిరుద్యోగ యువత దరఖాస్తు లు చేసుకున్నారు. ప్రభుత్వం రాత, శారీరక, పరుగు పందేం, కంటి పరీక్షలు నిర్వహించింది. ఇందులో విజేతలుగా నిలిచిన వారిని మెరిట్ ప్రకారం వడపోతపట్టి 18వేల మంది నిరుద్యోగులను పోలీసు కానిస్టేబుల్స్ ఉద్యోగం కోసం ఎంపిక చేసిం ది. వీరిలో సివిల్, ఎఆర్, ఎస్‌పిఎఫ్, జైల్ వార్డెన్స్ ఎంపికైన దాదాపు 14వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంది. కానీ టిఎస్‌ఎస్‌పి కానిస్టేబుల్‌గా ఎంపికైన 4203 మందిని మాత్రం శిక్షణకు పిలువడం మరిచింది. ఉద్యోగం సాధించినా ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఎంపికైన కానిస్టేబుల్స్ అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రక్షణ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ ఎల్‌పిఆర్‌బిచే మే 31, 2018లో కానిస్టేబుల్స్ నోటిఫికెషన్ విడుదల చేయించింది. దీంతో లక్షలాది మంది అర్హత గల యువతి, యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగం ఎలాగైన సంపాదించాలనే లక్ష్యంతో తమ తల్లిదండ్రుల కలను సహకారం చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలు పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు చేసి హైదరాబాద్ వంటి మహా నగరాల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మెళకువలు నేర్చుకున్నారు. ఇలా శిక్షణ పొందిన యువతి, యువకులు 30 సెప్టెంబర్, 2018లో ప్రభుత్వం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి 2019 మాసాల్లో దేహదారుఢ్య పరీక్ష (పిజికల్ వివేట్స్) నిర్వహించారు. తిరిగి 28 ఏప్రిల్ 2019లో మొయిన్స్ రాత పరీక్షలు నిర్వహించి పరీక్ష ఫలితాలను 24 సెప్టెంబర్ 2019లో ప్రకటించింది. మెరిట్‌ను బట్టి ప్రభుత్వం అన్ని వడపోతలు చేసి 18వేల మందిని కానిస్టేబుల్స్‌గా ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దాదాపు 14వేల మంది సివిల్, ఎఆర్, ఎస్‌పిఎఫ్, జైల్ వార్డెన్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించింది. కానీ టిఎస్‌ఎస్‌పి పోలీసు అభ్యర్థులకు మాత్రం నేటికీ ఈ శిక్షణకు పిలువలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4203 మంది ఎంపికైన అభ్యర్థులు ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 400 మందికిపైగా ఉన్నారు.
కాలయాపనతో కానిస్టేబుల్స్ మనోవేదన
ప్రభుత్వం నిర్వహించిన అన్ని పరీక్షల్లో నెగ్గినా 4203 మంది టిఎస్‌ఎస్‌పి పోలీసులను నేటికీ శిక్షణ ఇచ్చేందుకుగానూ ప్రభుత్వం సమాచారం అందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమతో పాటు ఎంపికైన దాదాపు 14వేల మంది సివిల్, ఎఆర్, ఎస్‌పిఎఫ్ జైల్‌వార్డెన్స్ శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం సాధించామన్న ఉత్సాహం కూడా తమకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారిందని అభ్యర్థులు వాపోతున్నారు. వేరే పనులు ఏమైనా చేసుకుందామంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని భయం వారిని వెంటాడుతుంది. మెడికల్‌గా అనార్హులు అవుతామేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వీరి సర్వీస్ కూడా కోల్పోతున్నారు. ప్రభుత్వం తమకు శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ కాలం అలస్యం చేస్తే తమ పరిస్థితి ఏమిటని సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించి వెంటనే శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు.