కరిగిపోతున్న వక్ఫ్ ఆస్తులు
తప్పుడు ఎన్‌ఒసిలకు కోట్ల ఆస్తి హాంఫట్
ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్రలో వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువైంది. రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారు. తప్పుడు ఎన్‌ఒసిలతో ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్తం చేశారు. రాష్ట్ర గెజిట్‌లో చేర్చిన ఏడాది తర్వాత అలాంటి ఆస్తులను గెజిట్ నుండి తొలగించే అధికారం వక్ఫ్‌బోర్డుకు గానీ, వక్ఫ్ సిఇఒకు గానీ లేదు. అయినా వక్ఫ్‌బోర్డు సిఇఒ లోగా కొనసాగిన అధికారులందరూ తమ వంతుగా ప్రైవేటు వ్యక్తులకు ఎన్‌ఒసిలు ఇవ్వడం, సర్వేనెంబర్లనే గెజిట్ నుండి తొలగించడం లాంటి పను లు చేశారు. దీని వల్ల వేల కోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తులు కర్పూరంలా కరిగి పోయాయి. దాదాపు 70 వేల ఎకరాలకు పైగా ఉన్న వక్ఫ్ భూములు 40 వేల ఎకరాలకు కుదించబడ్డాయి. దీనంతటికి కారణం వక్ఫ్‌బోర్డు అధికారులేనన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల ప్రైవేటు వ్యక్తులు వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు ఎన్‌ఓసిలతో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు కొనసాగినా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా వక్ఫ్ సంస్థలకు సంబంధించి 70 వేల ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నాయి. అయితే ఇది కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. వాస్తవానికి ఇందులో అక్రమణల్లోనే ఎక్కువ భూమలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాలు అనేక వెలసినా వాటిని పరిరక్షించుకోవడంలో తెలంగాణ వక్ఫ్‌బోర్డు ఘోరంగా విఫలమయ్యిందని వక్ఫ్ పరిరక్షణ సంస్థలు పేర్కొంటున్నాయి. అక్రమార్కులు తప్పుడు ఎన్‌ఓసిలు సంపాయించి ప్రైవేటు భూమిగా కబ్జాలకు పాల్పడిన అనేక ఉదంతాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్‌బోర్డు రికార్డుల్లో ప్రభుత్వ గెజిట్‌లో ఉన్న ఆస్తులు కూడా నేడు మనకు కనబడకుండా కరిగిపోతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కూడా ఆక్రమణ పర్వం కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. వక్ఫ్‌బోర్డు సిఇఓగా షేక్ మదార్, మన్నాన్ ఫరూఖీ, అబ్దుల్ హమీద్ ల హాయంలో అకేక అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలు కేసులు కూడ నమోదై ఉన్నాయి. హుస్సేన్ షా వలీ దర్గాకు చెందిన 1654 ఎకరాల భూమిలో దాదాపు 700 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమిని అప్పటి ప్రభుత్వం ల్యాంకో హిల్స్‌కు అప్పనంగా అప్పజెప్పిందనే ఆరోపణలు ఉన్నాయి. మహేశ్వరంలో రూ.10 వేల కోట్లకు పైగా విలువైన 490 ఎకరాల వక్ఫ్‌భూమి వక్ఫ్ భూమి కాదని అప్పటి సిఇఓ ఎన్‌ఓసి ఇవ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నటుల ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్‌గెజిట్‌లో ఉన్న భూమికి సంబంధించి ఎన్‌ఓసి ఇచ్చే అధికారం వక్ఫ్‌బోర్డుకు లేదని కేవలం కోర్టుల ద్వారానే తేల్చుకోవాల్సి ఉండగా సిఇఓలు ఎన్‌ఓసిలు ఇవ్వడం వల్ల వక్ఫ్ భూమి అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి వ్యవహారంలో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. యాదాద్రి జిల్లా భువనగరి మసీదుకు చెందిన వక్ఫ్ భూమి వివిధ సర్వేనెంబర్ల కింద ఉంది. ఇది గెజిట్‌లో కూడా ప్రచురించారు. అయితే వక్ఫ్‌బోర్డు సిఇఓ ఏకంగా 438 సర్వేనెంబర్‌నే గెజిట్ నుండి తొలగించారు. దీని వల్ల 28 ఎకరాల వక్ఫ్ భూమి ప్రైవేటు వ్యక్తుల పాలయ్యింది. పాత గెజిట్‌లో 34 సర్వేనెంబర్ ఉంటే ఆ తర్వాత దానిని కొత్త గెజిట్‌లో సర్వేనెంబర్ 3, 4 గా చూయించారు. దీని వల్ల వక్ఫ్ భూములకు ఎసరు పెట్టారని వక్ఫ్ పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.