ఆరు గ్యారంటీల అమలుతోపాటు ప్రజల్లోకి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు
ప్రచారానికి ముందే ఎన్నికల పోరుకు సమాయత్తం చేయాలి
కాంగ్రెస్ ముఖ్యనేతలకు సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ రంజాన్ తరువాత ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాలని, ఆరు గ్యారంటీల అమలుతో పాటు భవిష్యత్‌లో చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల ప్రచారానికి ముందే కార్యకర్తలను ‘ఎన్నికల పోరు’కు సమాయత్తం చేసేలా నియోజకవర్గ విస్తృత స్తాయి సమావేశాలను నిర్వహించాని ఆదేశించారు.హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి నివాసంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్యనేతలతో సిఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం.నరేందర్ రెడ్డి, భువనగిరి లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంఎల్‌ఎలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగామ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో పాటు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం చేయాల్సిన అంశాలు, ప్రత్యర్థుల బలాబలాలు, ప్రచార కార్యాచరణ, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు ఏడు నియోజకవర్గాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని, ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కాగా రంజాన్ పండగ తర్వాత ఈనెల 12 నుండి పోలింగ్ జరిగే ‘మే 13’ వరకు కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలోనే ఉండేలా కార్యచరణ ను రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలిసింది. కాగా భువనగిరి గెలపుబాధ్యతలను ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు.
2 లక్షల మెజార్టీ తగ్గకుండా గెలిపిస్తాం: రాజగోపాల్ రెడ్డి
భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని రెండు లక్షల మెజార్టీ తగ్గకుండా గెలిపిస్తామని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సమావశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించిదని, అనేక అంశాలతో పాటు ఎన్నికల్లో ముందుకెళ్లే అంశాలపై కూడా సమీక్షించామన్నారు. నామినేషన్ కార్యకర్తల సమావేశం,భువనగిరి లోక్‌సభ పరిధిలో టిఆర్‌ఎస్ చాప్టర్ క్లోస్ అయిందని, బిజెపి లేదని, తదమే గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త రాత్రింబవళ్లు కష్టపడాల్సిందేనని, పోలింగ్ వరకు ప్రతి నియోజకర్గంలో అతి విశ్వాసంతో పోకుండా , విశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి నియోజక వర్గాల వారిగా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజూ ఒక్క నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తలను కలువాలి. ర్యాలీలను నిర్వహించాలని సిఎం సూచించిన విషయాన్ని కిరణ్ కుమారెడ్డి తెలిపారు.
మే మొదటి వారంలో
రాష్ట్రానికి ప్రియాంకగాంధీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎఐసిసి నాయకులు ప్రియాంక గాంధీ మే నెల మొదటి వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 21న భువనగిరి ఎంపి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే , ఆ తర్వాత ఎన్నికల ప్రచార జోరును పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించారు. మే మొదటి వారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.