దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
ఉనికిని కోల్పోవడానికి ముస్లింలు అంగీకరించరు
ఎఐఎంపిఎల్‌బి, జమియత్ స్పష్టీకరణ
లా కమిషన్‌కు నివేదికలు సమర్పణ
న్యూఢిల్లీ : దేశానికి ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అవసరం లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఎఐఎంపిఎల్‌బి), ప్రముఖ ముస్లిం విభాగం జమియత్ ఉలేమా 22వ లా కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశాయి. ఈ దేశంలో ముస్లింలు తమ ఉనికిని, గుర్తింపును కోల్పోవడానికి అంగీకారంతో లేరని ఎఐఎంపిఎల్‌బి పునరుద్ఘాటించింది. ఇప్పటికే తిరస్కరించిన విషయాన్ని ఎందుకు మళ్ళీ తెరమీదకుతెచ్చారని ఎఐఎంపిఎల్‌బి ప్రశ్నించింది. లా కమిషన్ విజ్ఞప్తి మేరకు ఈ రెండు విభాగాలూ తమ తమ అభిప్రాయాలను నిర్దంద్వంగా నివేదికల రూపంలో సమర్పించాయి. ప్రజలపై ఎలాంటి నిర్ణయాలు రుద్దాలనుకున్నాగానీ ఏకాభిప్రాయసాధనకు కృషి చేయాలని పేర్కొన్నాయి. అదేవిధంగా జమియత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుసిసి దేశానికి అవసరం లేదని చెబుతూ, ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో ప్రారంభించిన చర్చను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. కాగా ఎఐఎంపిఎల్‌బి అధికార ప్రతినిధి ఎస్ క్యూ ఆర్ ఇల్యాస్ మాట్లాడుతూ, కొన్నేళ్ళ క్రితం కూడా ఈ సమస్య తెరమీదకు వచ్చిందని,ఇంతకుముందు ఉన్న లా కమిషన్ ఈ సమస్యను పరిశీలించి ఇది అనివార్యం కాదనీ, ఎవరికీ ఇష్టం కూడా కాదనీ, రాబోయే పదేళ్ళ కాలం వరకూ కూడా యుసిసి ఆలోచనల అవసరం లేదని తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత తక్కువ సమయంలో తిరిగి ఈ అంశాన్ని ప్రజల్లో చర్చకు తీసుకురావడం,లిఖితపూర్వకంగా ఎలాంటి ముందస్తు సమగ్ర నామూనా ప్రణాళికా లేకుండా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ఉమ్మడ స్మృతి పేరుతో మెజారిటీ నైతిక ధర్మాలు మైనారిటీ మతాల కుటుంబ చట్టాలను, మత స్వాతంత్య్రాన్ని, మత స్వేచ్ఛను రద్దు చేయలేరని ఆయన పునరుద్ఘాటించారు. “ఇది పూర్తిగా న్యాయ సంబంధమైన అంశం, కానీ ఈ విషయాన్ని చాలా అసమగ్రంగా, ఒక పద్దతి లేకుండా ‘ఔను అనే అభిప్రాయాలు చెప్పమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టడం కేవలం ఒక రాజకీయ వనరుగా ఉపయోగించుకోవడం, మీడియా ద్వారా ప్రోపగాండ కొనసాగించడం తప్ప మరే ఇతర చర్యా కాదని కూడా ఇల్యాస్ విమర్శించారు.
మతం విషయంలో రాజీ ప్రసక్తే లేదు
యుసిసి మత స్వేచ్ఛకు వ్యతిరేకమని, మత వ్యవహారాల్లో రాజీ పడేదే లేదని జమియత్ ఉలేమా లా కమిషన్‌కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ యుసిసిపై మాట్లాడుతూ, ఉమ్మడి పౌరస్మృతిపై చర్చను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. రాజ్యాంగం సమకూర్చిన హక్కులకు అనుగుణంగా యుసిసి ప్రతిపాదన చేయడమంటే మత స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అన్ని మతాలు, గిరిజన గ్రూపుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. బుధవారం లా కమిషన్‌కు సమర్పించిన నివేదికలోని కీలక అంశాల పాఠాన్ని గురువారం ఆయన మీడియాకు విడుదల చేశారు. మొదటినుండీ తాము ఇదే అభిప్రాయంతో ఉన్నామన్నారు. ఈ దేశంలో మతాన్ని స్వేచ్ఛగా అనుసరిస్తున్నాం, మత వ్యవహారాల్లో మేం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ మతాన్ని అనుసరించినాగానీ, ఏ మతాన్ని కొలిచినాగానీ ఆ వ్యవహారాలు స్వేచ్ఛగా ఉండాలన్నారు. “మేం ఈ పాలకులకు చెప్పేది ఒక్కటే, ఈ దేశంలో ఎలాంటి నిర్ణయం ప్రజలమీద రుద్దాలనుకున్నాగానీ, ప్రజలపై ఎలాంటి ఆంక్షలు విధించాలనుకున్నాగానీ ముందుగా ప్రజల నిర్ణయాలను గ్రహించాలి, వారి అభిప్రాయాలను సేకరించాలి, ఒక ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి జరగాలి” అని ఆయన అన్నారు.
యుసిసిపై చర్చరాజకీయ కుట్ర
RELATED ARTICLES