కార్పొరేట్ల ఆస్తులను జాతీయం చేస్తేనే పురోభివృద్ధి
మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి
ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై
ప్రజాపక్షం/హైదరాబాద్ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మత ఛాందస పోకడలను అనుసరిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత పోరాటాలు జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని మగ్దూం భవన్ రాజ్‌బహదూర్ హాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రధాని హిందూత్వ అజెండాను దేశంపై రుద్దడానికి కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కేవలం పెట్టబడిదారి కార్పొరేట్ శక్తులకు అనుకూలించే విధానాలనే అవలంభిస్తున్నారని విమర్శించారు. దేశ యువతకు అవసరమైన విధానాలను అమలు చేయడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలలో 45 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయని, యువతకు ఉపాధి కల్పించకుండా దేశ ప్రగతి సాధ్యం కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ల ఆస్తులను జాతీయం చేయాలని, తద్వారా దేశ పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జరిపిన పోలీసు పరీక్షలలో అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించాలని, అభ్యర్థుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని తిరుమలై డిమాండ్ చేశారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాంద్రీ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ మత విద్వేషాలను తెలంగాణ యువత నిశితంగా పరిశీస్తుందని, యువత సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని, మత ఉన్మాదాన్ని తుద ముట్టించాలన్నారు. ఆ బాధ్యతను యువత తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు నెర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, మహేందర్, మానస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి కల్పించకుండా దేశ ప్రగతి అసాధ్యం
RELATED ARTICLES