HomeNewsBreaking Newsయువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైయువత ఉద్యమించాలి

యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైయువత ఉద్యమించాలి

ఉపాధి కల్పించని పాలకులను ఎన్నికల్లో ఓడించాలి
ఎఐవైఎఫ్‌ జాతీయ వర్క్‌షాప్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శ
సయ్యద్‌ అజీజ్‌ పాషా పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
మోడీ ఫాసిస్టు నిరంకుశ విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి కల్పించని పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎం.పి. సయ్యద్‌ అజీజ్‌ పాషా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో శనివారం అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) జాతీయ వర్క్‌ షాప్‌ జరిగింది. జాతీయ వర్క్‌ షాప్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన యువజన సంఘం జెండాను ఎఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సుఖేందర్‌ మహేసరి ఎగురవేశారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ సమాజంలోని బలహీన, శ్రామిక అన్ని వర్గాలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత ఉద్యమించాలన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయన్నారు. కర్నాటక ఫలితాలతో దక్షిణ భారతంలో బిజెపి గేట్‌ మూసుకుపోయిందన్నారు. మోడీ తన వ్యక్తిత్వ వికాసానికి లక్షలాది నిధులు వెచ్చిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి మతపరమైన నినాదాలు, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల్లో జై భజరంగ్‌ బలి అంటూ నినాదాలు చేశారని, కానీ ప్రజలు స్పందించలేదన్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయని, దీనిపైనే బిజెపి దృష్టి సారిస్తోందని, విపక్షాల ఐక్యతతోనే బిజెపిని ఓడించవచ్చనే సర్వేలు చెబుతున్నాయని వివరించారు. కొంతమంది బి-టీమ్‌ నాయకులు అతనికి సహాయం చేయవచ్చని, ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో౭ నిరుద్యోగంపై అనేక సర్వేలు ఆందోళన కారమైన నివేదికలు ఇస్తున్నాయన్నారు. ఈ సమస్యలను బలమైన ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అజీజ్‌ పాషా పిలుపునిచ్చారు. ఇది ఎఐవైఎఫ్‌ బలోపేతం కావడానికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్‌ మహేసరి, తిరుమలై రామన్‌లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు పాలకులను ఉద్యమాల ద్వారా యువత మేల్కొల్పాలన్నారు. నరేంద్రమోడీ మత ఛాందస విధానాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు టి.టి. జిస్మాన్‌, లెనిన్‌ బాబు, అరుణ్‌, విక్కీ, హరీష్‌ బాల, భారతి, కరంవీర్‌ కౌర్‌, రాష్ర్ట అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, రాష్ర్ట నాయకులు నిర్లకంటి శ్రీకాంత్‌, లింగం రవి, యుగంధర్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సల్మాన్‌ బైగ్‌, టి. సత్య ప్రసాద్‌లతో పాటు 23 రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments