అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
కాంగ్రెస్ సూచనతో శాసనసభ తీర్మానానికి అంగీకారం
నేడు ఏకగ్రీవ తీర్మానం
ప్రజాపక్షం / హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యురేనియం తవ్వకాలకు ఎవ్వరికి ఏ విధమైన అనుమతి ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులోనూ అనుమతించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లమల అడవులను నాశనం కానివ్వమని స్పష్టం చేశారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతించిందని, కడప జిల్లాలో తవ్వకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. శాసనసభలో ఆదివారం బడ్జెట్‌పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల డెల్టా కలుషితమై నాశనమయ్యే పరిస్థితి వస్తుందని, హైదరాబాద్‌కు తాగునీటిని కూడా తీసుకోలేని ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఈ విషయంలో కేంద్రం ఒత్తిడి తెస్తే కొట్లాడుతామన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలన్న కాం గ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క సూచనకు సిఎం అంగీకరించారు. సోమవారం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామన్నారు.
కేంద్ర మోటర్ వాహనాల చట్టాన్ని అమలు చేయం
కేంద్ర ప్రభుత్వం సవరించిన మోటర్ వాహనా ల సవరణ చట్టాన్ని (ఎంవి యాక్ట్ -2019) తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని సిఎం కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చట్టాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని రూపొందిస్తుందని చెప్పారు. శాసనసభలో ఆదివారం బడ్జెట్‌పై సాధారణ చర్చకు సమాధానమిస్తూ ఎంఐఎం సభ్యులు కౌసర్ మోహియుద్దీన్ అడిగిన ప్రశ్నకు సిఎం పైవిధం గా సమాధానం ఇచ్చారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని సిఎం అన్నారు. దీంతో భారీ చలానాల బారినపడే ప్రమాదం రాష్ట్ర ప్రజలకు తప్పినట్లే.