HomeNewsBreaking Newsయుపి ఐదో దశలో 55 శాతం పోలింగ్‌

యుపి ఐదో దశలో 55 శాతం పోలింగ్‌

292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి
మార్చి 3, 7 తేదీల్లో 6, 7వ విడత పోలింగ్‌
లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారంనాడు జరిగిన ఐదో దశ పోలింగ్‌లో 54 శాతం ఓటింగ్‌ శాతం నమోదైంది. 12 జిల్లాలలో 61 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సాయంత్రం ఆరు గంటల సమయానికి అతి తక్కువగా 54.98 శాతం పోలింగ్‌ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ పూర్తయింది. 2.24 కోట్లమంది అర్హులైన ఓటర్లు ఈ విడత పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. 692 మంది అభ్యర్థులు ఈ విడత 12 జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుండి పోటీ పడ్డారు. వీరిలో ఉత్తర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఉన్నారు. ఆయన కౌశాంబిజిల్లాలోని సిరతు నియోజకవర్గం నుండి పోటీపడ్డారు. ఆయనకు ప్రత్యర్థిగా అప్నాదళ్‌ (కమెరవాది) పార్టీకి చెందిన అభ్యర్థి పల్లవి పటేల్‌ బరిలో నిలిచారు. అలహాబాద్‌ వెస్ట్‌ నియోజకవర్గం నుండి మంత్రి సిద్ధార్థ నాథ్‌ సింగ్‌, ప్రతాప్‌ఘర్‌ జిల్లా పట్టి నుండి మరో మంత్రి రాజేంద్ర సింగ్‌, అలహాబాద్‌ సౌత్‌ నుండి మంత్రి నంద్‌ గోపాల్‌ గుప్త నది, మన్కాపూర్‌ (గోండా) నుండి మంత్రి రమాపతి శాస్త్రి పోటీ పడ్డారు. ఈ విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ప్రతిష్టాత్మకమైన అమేథీ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నాటికి 52.82 శాతం, రాయ్‌బరేలీలో 56.06 శాతం ఓటింగ్‌ జరిగింది. మరో ప్రతిష్టాత్మకమైన అయోధ్య నియోజకవర్గంలో 58.01 శాతం, బహ్రైచ్‌లో 54.68 శాతం, బారాబంకీలో 54.75 శాతం, చిత్రకూట్‌ నియోజకవర్గంలో 59.50 శాతం, గోందా లో 54.21 శాతం, కౌశాంబీలో 56.96 శాతం, ప్రతాప్‌ఘర్‌లో 50.20 శాతం, ప్రయాగ్‌రాజ్‌లో 51.29 శాతం, శ్రావస్తిలో 57.24 శాతం, సుల్తాన్‌పూర్‌లో 54.91 శాతం ఓటింగ్‌ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. సమాజ్‌వాదీపార్టీ నాయకుడు గుల్షన్‌ యాదవ్‌ అభ్యర్థిగా పోటీపడుతున్న ప్రతాప్‌ఘర్‌జిల్లా కుందా నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజేంద్ర చౌధురిలు కుందా నియోజకవర్గంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బిజెపికి మద్దతు ఇచ్చినందుకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అభ్యర్థి యోగేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, ఇతరులు శనివారంనాడు రాత్రి ఒక ఇంట్లోకి దూసుకువెళ్ళి ఒక మహిళపైన, వారి కుటుంబ సభ్యులపైన దాడి చేశారన్న ఆరోపణలపై వారిమీద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 1993 నుండి కుందా నియోజకవర్గంలో ఎంఎల్‌ఎగా చెలామన్తున్న రాజాభయ్యా (రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌) పై మరోసారి ఆయన పురాతన ప్రత్యర్థి గుల్షన్‌ యాదవ్‌ సమాజ్‌వాదీపార్టీ తరపున గట్టి పోటీ ఇచ్చారు.కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌ తల్లి,అప్నాదళ్‌ (కె) నాయకురాలు క్రిష్ణ పటేల్‌ ప్రతాప్‌ఘర్‌ స్థానం నుండి పోటీ చేశారు. ఈ పార్టీ సమాజ్‌వాదీపార్టీతో జత కట్టింది. కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ తండ్రి పేరిట ఏర్పడిన అప్నాదళ్‌ (సోనేలాల్‌) చీలిక పార్టీ తరపున పోటీ చేస్తున్న తన తల్లి క్రిష్టపటేల్‌పై అనుప్రియ పటేల్‌ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు ఆరాధనా మిశ్రా మోనా ప్రతాప్‌ఘర్‌జిల్లాలో రామ్‌పూర్‌ ఖాస్‌ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.
మొత్తం ఉత్త ప్రదేశ్‌లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆదివారంనాటి ఐదో విడత పోలింగ్‌తో 292 స్థానాలకు ఓటింగ్‌ పూర్తిఅయింది. ఇంకా 111 నియోజకవర్గాలకు రెండుదశల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. మార్చి 3వ తేదీన ఆరోదశ పోలింగ్‌, మార్చి 7న ఏడో దశ పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 10 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments