HomeNewsBreaking Newsయుకె ప్రధానిగా రిషి సునాక్‌

యుకె ప్రధానిగా రిషి సునాక్‌

200 ఏళ్లలో బ్రిటన్‌కు అతి చిన్న, మొదటి శ్వేతజాతీయేతర పిఎంగా కొత్త చరిత్ర
లండన్‌:
భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యుకె) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 210 సంవత్సరాల్లో ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా 42 ఏళ్ల సునాక్‌ చరిత్ర సృష్టించారు. అంతేగాక, ఈ హోదాను సంపాదించిన మొదటి శ్వేత జాతీయేయతర వ్యక్తిగా కూడా రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నారు. లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయడంతో కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడిన విషయం తెలిసిందే. తొలుత మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేరు వినిపించినప్పటికీ, ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. దీనితో రిషి సునాక్‌, పెన్నీ మోర్డెంట్‌ రేసులో మిగిలారు. అయితే, తాను వైదొలగుతున్నట్టు మోర్డెంట్‌ ప్రకటించడంతో సునాక్‌ ఎన్నిక లాంఛనంగా మారింది. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్‌ రాజు మూడవ చార్లెస్‌ ఆహ్వానించడం, ఆ వెంటనే సునాక్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం అత్యంత వేగంగా జరిగిపోయాయి. రెండు నెలల క్రితం జరిగిన నాయకత్వ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడిన ఆయన॥ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇన్పోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌. నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని 2009లో వివాహం చేసుకున్న సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ ప్రాంతానికి చెందిన వారు. సునాక్‌, అక్షత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, కృష్ణ, అనుష్క. ఇలావుంటే, సునాక్‌ విజయంపై లేబర్‌ పార్టీ డిప్యూటీ నాయకుడు ఎంనీ ఏంజెలా రేసర్‌ మాట్లాడుతూ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళతారన్న విషయంలో ఒక్క మాట కూడా చెప్పకపోవడం విచిత్రమని వ్యాఖ్యానించారు. ప్రధానిగా ఎన్నికైన సునాక్‌ అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇలావుండగా బ్రిటన్‌కు గత ఆరేళ్ల కాలంలో సునాక్‌ ఐదో ప్రధాని. ర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న యుకెను ఆ సమస్య నుంచి బయట పడేయడమే సునాక్‌ ముందున్న పెద్ద సవాలు. దానిని ఏ విధంగా పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.
ఆర్థిక స్థిరత్వమే ప్రధాన లక్ష్యం..
ఆర్థిక స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా రిషి సునాక్‌ స్పష్టం చేశారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తన కంటే ముందు ఈ హోదాలో ఉన్నవారు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దడానికే తనను ప్రధానిగా ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఐకమత్యంతో ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలు చేరగలుగుతామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం, కరోనా విధ్వంసం నుంచి బయటపడడం, ద్రవ్యోల్బణ పరిస్థితులను చక్కదిద్దడం వంటి అంశాలను యుద్ధ ప్రాతిపదికపై పరిశీలించి, సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని, అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ‘నేను దేశంలో ఐక్యతను కేవలం మాటల్లో కాదు.. నా చేతల ద్వారా తీసుకొస్తాను’ అని ప్రకటించారు. దేశానికి అత్యుత్తమ సేవలు అందించడానికి ప్రతిక్షణం కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments