ఒక్కసారైనా గుడికి వెళ్లాలన్న ఉత్సుకత కలిగించాలి
అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు ముమ్మరం
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలోని ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తు ల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్, సోమవారం ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ అండ్ బి ఇఎన్‌సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఇ.ఇ. వసంతర్ నాయక్, ఎస్.ఇ. లింగారెడ్డి, వైటిడిఎ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఇఒ గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్ సాయి, స్ట్రక్చర్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి భూ పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని చెప్పారు. అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ వంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని సిఎం అధికారులను కోరారు. శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సిఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, దీనికోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని చెప్పారు.