ఉగ్రరూపం దాల్చిన యమునానది
40 ఏళ్ల క్రితం రికార్డు దాటి అల్‌టైమ్ గరిష్టానికి
ఉత్తరాదిన వర్షబీభత్సానికి 100 మందికిపైగా మృతి
న్యూఢిల్లీ : ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా తలెత్తిన వరదతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు వంద మందికి పైగా మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది వరకు చనిపోయారు. ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకు పోయాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ధాటికి దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి.. చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది. దీంతో ఢిల్లీలోని అనేక కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది. ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధానిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సమూహంగా ఉండొద్దని పేర్కొంది. అలాగే ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని కోరింది. 1978లో యమునా నది నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడం వల్ల ఢిల్లీలో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకు పోయారు. కుల్లు జిల్లాలో కసోల్ ఏరియాలో 2000 మంది టూరిస్టులు చిక్కుకు పోయారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌సింగ్ సుఖు వెల్లడించారు. లహౌల్‌లో 300 టూరిస్టు వాహనాలు ఇరుక్కుపోయాయన్నారు. కులు మనాలి రోడ్డు మంగళవారం సాయంత్రం ప్రారంభం కావడంతో దాదాపు 2200 వాహనాలు ఆ రూటులో వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆస్తినష్టం రూ. 4000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంకా 873 రోడ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. 1956 ట్రాన్స్‌ఫార్మర్లు, 1369 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోయారు. 13 మంది గాయపడ్డారు.ఉత్తరాఖండ్‌లో నైనిటాల్, చంపావత్, ఉదమ్‌సింగ్ నగర్, పౌరీగ్‌డ వాల్ జిల్లాలకు ప్రభుత్వ రె్‌డ అలర్ట్ జారీ చేసింది. హరిద్వార్, డెహ్రాడూన్, తెహరీ, గఢ్‌వాల్ , రుద్రప్రయాగ్, జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.
హత్నికుండ్ నుంచి పరిమిత పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తే యమునా నీటిమట్టం పెరగదు
ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అక్కడ యమునా నది నీటి మట్టం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. హత్నికుండ్ నుంచి పరిమిత పరిమాణంలోనే నీటిని విడుదల చేయాలని, దీనివల్ల యమునా నీటి మట్టం మరింత పెరగకుండా ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో జి20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు. ఈ సమయంలో ఒకవేళ ఢిల్లీలో వరదలు వస్తే ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వదని తెలిపారు. యమునా నదిలో ప్రమాదకర స్థాయి దాటిన వదర ఉద్ధృతి ఉందని తెలిపారు. బుధవారం రాత్రికి యమునా నది ప్రవాహం 207.72 మీటర్ల కు చేరుతుందని కేంద్ర జలసంఘం అంచనా వేసిందని తెలిపారు. ఇది ఢిల్లీకి మంచి పరిణామం కాదని అన్నారు. ఢిల్లీలో రెండు రోజుల నుంచి వర్షాలు లేవని, అయినప్పటికీ హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి విడుదల అవుతున్న నీటితో యమునాలో నీటి ప్రవాహం పెరుగుతోందని వివరించారు. నీరు విడుదల చేయకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మరోవైపు, ఢిల్లీలో వరద సహాయ శిబిరాలను ఢిల్లీ మంత్రి అతిషి సందర్శించారు. సహాయక శిబిరాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. యమునా నదిలో నీటిమట్టం నిరంతరం పెరుగుతోందని చెప్పారు. తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.