భద్రాచలంలో సీన్ రిపీట్
గవర్నర్ పర్యటనకు అధికారులు డుమ్మా
సెలవుపై కలెక్టర్, ఎస్‌పి, ఐటిడిఎ పిఒ
ప్రజాపక్షం / ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర అధికార యంత్రాంగం తూచ తప్పకుండా పాటిస్తున్నట్లు కన్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు రాగానే అధికార యంత్రాంగం కూడా గవర్నర్ పర్యటనకు దూరంగా జరుగుతూ ప్రోటోకాల్ నిబంధనలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. శ్రీరామ నవమి సందర్బంగా సీతారాముల కళ్యాణం తర్వాత జరిగే పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ హాజరయ్యారు. సోమవారం జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి ఒక ప్రత్యేక రైలు బోగిలో కొత్తగూడెం చేరుకున్నారు. కొత్తగూడెంలోని ఇల్లందు సింగరేణి అతిథి గృహంలో గవర్నర్ బస చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పట్టాభిషేక కార్యక్రమానికి భద్రాచలం వెళ్లారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు వచ్చి గవర్నర్‌కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాకలెక్టర్ అనుదీప్ 48 గంటల సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుంది. సోమ వారం ఆమె భద్రాచలం ఆలయంకు చేరుకున్న ప్పుడు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం హాజరు కావాల్సిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి, ఐటిడిఏ పివో ఎవరు కూడా హాజరు కాలేదు. కలెక్టర్ అనుదీప్, ఎస్‌పి సునీల్‌దత్, ఐటిడిఏ పివో గౌతమ్ పోట్రు ఆకస్మికంగా 48 గంటలు సెలవుపై వెళ్లా రు. ఉన్నతాధికారులు గైర్హాజరైనప్పటికీ జా యిం ట్ కలెక్టర్, ఏఎస్‌పిలు గవర్నర్ పర్యటనలో పాల్గొ న్నారు. పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన డం తో పాటు దమ్మపేట మండలంలోని కొండ రెడ్లతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయినా గవర్నర్ పర్యటన ముందు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలలుగా గవర్నర్‌కు కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు పొరచూపాయి. గడచిన కొద్ది నెలలుగా రాజ్‌భవన్ వైపు అధికారులు తొంగి చూడడం లేదు. ఇటీవల ఉగాది ఉత్సవాల సందర్బంగా కూడా రాజ్‌భవన్‌కు టిఆర్‌ఎస్ నేతలు హాజరు కాలేదు. మంత్రులు కేటిఆర్, సత్యవతిరాథోడ్ తదితరులు గవర్నర్ వ్యవహార శైలిని తప్పుబడుతూ ప్రకటనలు చేశారు. గవర్నర్ యాదాద్రి వెళ్లినప్పుడు సైతం అక్కడ ఆలయ ఈవో హాజరు కాలేదన్నది విదితమే. ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తూచ తప్పకుండా పాటిస్తూ యథా ప్రభుత్వం తథా అధికారులు అన్నట్లుగా ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు సైతం తూట్లు పొడుస్తున్నారు. భద్రాద్రి రామాలయ చరిత్రలో పట్టాభిషేక మహోత్సవానికి అనేక మంది గవర్నర్లు హాజరైనారు. ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడు ఎదురు కాలేదు. ఇది గవర్నర్ తమిళ సైకి జరిగిన అవమానంగా భావిస్తున్నారు.
భగవంతుడే చూసుకుంటాడు : గవర్నర్
తన పర్యటనకు అధికారులు హాజరు కాకపోవడం పై గవర్నర్ తమిళ సై స్పందిస్తూ తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, జరుగుతున్న అవమానాలకు సంబంధించి అన్ని భగవంతుడే చూసుకుంటాడని ఆమె అన్నారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని ఆమె తెలిపారు. ఆలయ అధికారులు తనను సన్మానించారని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. సోమవారం సాయంత్రం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొన్నారు.
యథారాజా తథా అధికారి
RELATED ARTICLES