HomeNewsBreaking Newsయజ్ఞంలా ‘దళితబంధు’

యజ్ఞంలా ‘దళితబంధు’

ప్రాణం పోయినా వదలబోం
బిసి,ఇబిసి, గిరిజన, అగ్రకులాలలోని పేదలకూ వర్తింపజేస్తాం
సిఎం కె.చంద్రశేఖర్‌ రావు
టిఆర్‌ఎస్‌లో చేరిన మోత్కుపల్లి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాబోయే ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఖర్చు రూ.23 లక్షల కోట్లు అవుతుందని, అందు లో దళితబంధుకు కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయలేమా అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. దళితబంధు ఒక యజ్ఞం లాంటిదని, ప్రాణం పోయినా దీనిని వదలబోమని, బిసి,ఇబిసి,గిరిజన అగ్రుకులాలలోని పేదలకు కూడా వర్తింపజేస్తామని, దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. చాలా మందికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వమే అయితే, ఆ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బాధలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. మోత్కుపల్లికి కెసిఆర్‌ గులాబీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ వచ్చే టర్మ్‌లో కూడా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. .కొందరికి తెలియక దళిత బంధుకు డబ్బులెలా తెస్తారని అన్నారని, అందుకు దమ్ము, ధైర్యం కావాలని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎలా వస్తుందని ప్రశ్నించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడొ దరికొచ్చిందన్నారు. టిఆర్‌ఎస్‌కు రాజకీయం అంటేనే ఒక క్రీడ, గేమ్‌ అని, ఒక యజ్ఞం అని, ఏదైనా ఎత్తుకున్నదంటే దాని సంగతి తెలాలని చెప్పారు. ప్రస్తుతం రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఆగం, అయోమయం చేసే శక్తులు ఉంటాయని అయినప్పటికీ దళితబంధును అమలు చేసి వంద శాతం విజయం సాధిస్తామన్నారు. దళితబంధును విజయవంతం చేస్తే ఇతర వర్గాలూ విజయం సాధిస్తారన్నారు. యాదవుకు గొర్రెలను పంపిణీ చేస్తే దళితులు అడ్డుపడలేదని, దళితబంధు అమలు చేస్తే కొందరు తిక్క వేశాలు వేసినట్టు వేయలేదని, తమకు ఏదైనా చేయాలని కోరారని అన్నారు. రాష్ట్రంలో దళిత కులం పెద్దదని, 75 లక్షల మంది ఉన్నారని, ఇందులో 13 లక్ష మందికే భూమి ఉన్నదని వివరించారు. గిరిజనులకు 22 లక్షల మంది వద్ద భూమి ఉన్నదన్నారు. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇలాంటి స్కీములు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బలమైన నాయత్వం, పార్టీ, లీడర్లు ఉండాలని, పది మందిని సముదాయించి, ముందుకు తీసుకెళ్లే నేతలు కావాలని అన్నారు. నోరు లేనివారు, పేదల కోసమే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చామన్నారు. దళితబంధు ఓట్ల కోసం పెట్టలేదని, ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని, ఒక సారి గెలుస్తుండొచ్చు, ఒక సారి ఒడిపోతుండొచ్చని, దీంతో తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. తాము రాష్ట్రానికి కన్నతండ్రి బాధ్యతలో ఉన్నామని, సంకుచితంగా, చిన్న విషయాలను పట్టించుకోలేదని తెలిపారు. లబ్ధిపొందినవారే ఆలోచించుకుంటారని, వారే తమను కాపాడుకుంటారన్నారు. గ్రామ, మండల, నియోజకర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బ్రిగేడ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జాతీయ పార్టీలను ఒప్పించామని, ఒక్క బిఎస్‌పి అధినేత మాయావతినే 19 సార్లు కలిసినట్టు వివరించారు.
అప్పుడే పక్కకు జరుగుదామనుకున్నా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడే పక్కకు జరుగుదామని అనుకున్నానని సిఎం కెసిఆర్‌ అన్నారు. అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారని, తననే ఉండాలని కోరినట్టు తెలిపారు. అందుకే ఉన్నానని, ఏడ్చేటోళ్లు ఎప్పుడూ ఏడుస్తునే ఉంటారని, లెక్క చేయకుండా తెలంగాణను ఒక దారిలో పెట్టానని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని వివరించారు. పేదల నుంచి కళ్యాణలక్ష్మీకి అదనంగా కట్నం అడిగితే దౌడపగులగొట్టాలని సూచించారు. మోత్కుపల్లి నర్సింహులు తనకు మంచి స్నేహితుడని, కరోనా వస్తే కోటీ రూపాయాలు ఖర్చు పెట్టే విషయమై వైద్యులతో మాట్లాడిన విషయాని గుర్తు చేశారు. ఆయన సేవలను ఏ స్థాయిలో వాడుకోవాలో ఆ స్థాయిలో వాడుకుంటామని చెప్పారు. భువనగిరి ఎంపి నర్సయ్య గౌడ్‌ను ఓడించారని,ఈ సారి గెలిపించాలన్నారు. ఇదిలా ఉండగా సిఎం కెసిఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో సభికుల నుంచి ఒకరు అమరుల ప్రస్తావన తీసుకురాగా, అయితదని, మంత్రిని వచ్చి కలువాలని సూచించారు. మరొక వ్యక్తి దళితులందరినీ కలుపుకుని పోవాలని, లీడర్లు వాళ్లకు వాళ్లే చేసుకోవాలని చూస్తున్నారన్నారు. సమావేశనంతరం కొందరు సిఎం కెసిఆర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments