ఎన్నికల్లో ప్రజలు ధీరత్వాన్ని ప్రదర్శించాలి
దేశానికే తలమానికంగా రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం/ మెదక్ ప్రతినిధి
రానున్న ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల మోసకారుల మాటలు నమ్మితే తెలంగాణ ప్రజలు గోసపడక తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ధీరత్వాన్ని ప్రదర్శించి ప్రజాసేవ చేసే నాయకులను గుర్తించాలన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో 20 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను మంత్రి టి.హరీష్‌రావు, ఎంఎల్‌ఎ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సిఎం కెసిఆర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం
ప్రగతి శంఖారావం సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ సిద్దిపేట మాదిరాగానే మెదక్ జిల్లాను అభివృద్ది చేయాలని మంత్రి హరీష్‌రావుకు సూచించారు. మెదక్ పర్యటనలో జిల్లా ప్రజలకు సిఎం వరాలు కురిపించారు. మెదక్ పట్టణ అభివృద్దికి రూ.50 కోట్లను, జిల్లాలోని రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్సున మొత్తం రూ.75 కోట్లు, జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.15 లక్షలను మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఎన్నో ఎళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రామాయంపేట, కౌడిపల్లిలో డిగ్రీ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చారు. మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పర్యాటక శాఖ ఏడుపాయల అభివృద్దికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందని, ఇతర రాష్ట్రాల రైతులు, నాయకులు తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో రైతుల ముఖాలు మెరుస్తున్నాయని, పల్లెల్లో పంటలు పచ్చబడుతున్నాయని, మరో ఐదేళ్లలో రైతులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. పంజాబ్ కన్నా వరి సాగులో తెలంగాణ ముందు వరుసలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది చేతగాని నాయకులు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామనడం సిగ్గుచేటని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లేకపోతే అక్రమాలు జరిగే అవకాశం ఉందని సిఎం అన్నారు. కరోన ప్రభావంతో రైతుల రుణమాఫీ ఆలస్యం అయిందని, ఇప్పటివరకు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ధరణి రద్దు చేసే వారిని బంగాళాఖాతంలో కలుపాలని ప్రజలకు సిఎం సూచించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు కావాలనే కాంగ్రెస్ నాయకులు, మోటార్లకు మీటర్లు పెట్టే బిజెపి నాయకులను నమ్మవద్దని సూచించారు. ఎన్నికల సమయానికి వచ్చి కాళ్లు మొక్కుతున్నారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అక్టోబర్ 16న జరిగే బిఆర్‌ఎస్ సభలో అద్భుత పథకాలు ప్రకటిస్తామని సిఎం వెల్లడించారు. గత ఎన్నికల్లో నా బిడ్డ పద్మాదేవేందర్‌రెడ్డిని ఆశీర్వదించమని ప్రజలను కోరగా అత్యధిక మెజార్టీతో గెలిపించారని, మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మరోసారి స్థానిక ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌రెడ్డిని ప్రజలు దీవించి అసెంబ్లీకి పంపాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ మహమూద్ అలీ, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వి.సునీతాలక్ష్మారెడ్డి, ఎంఎల్‌ఎలు సిహెచ్.క్రాంతికిరణ్, జాజుల సురేందర్, మదన్‌రెడ్డి, గూడెంమహిపాల్‌రెడ్డి, రసమయి బాలకిషన్, ఎంఎల్‌సిలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, ఫారుక్‌హుస్సేన్, సత్యనారాయణ, జెడ్‌పి చైర్ పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్‌లు చంద్రపాల్, పల్లె జితేందర్‌గౌడ్, రవీందర్‌గౌడ్, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మోసకారులతో మోసపోవద్దు
RELATED ARTICLES