పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వ్యూహమిదే
టిఆర్‌ఎస్ వర్గాల వెల్లడి
ప్రజాపక్షం/ హైదరాబాద్ : చివరి పార్లమెంట్ సమావేశాల్లో దూకుడుగా ప్రదర్శించేందుకు టిఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో అమలుకు నోచుకోని అంశా లు, జాతీయ రహదారులు, రిజర్వేషన్ల అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. ఈనెల 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఇదే చివరి కావడంతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాలలో పర్యటించిన కెసిఆర్, ఇక పార్లమెంట్ వేదికగా బిజెపిని టార్గెట్ చేయడం ద్వారా బిజెపి, కాంగ్రెస్‌కు సమాన దూరం లో తమ ఫ్రంట్ ఉండబోతుందనే సంకేతాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి మాసంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు టిఆర్‌ఎస్ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులును కలిసి తెలంగాణ రాష్ట్ర సమస్యలు, విభజన అంశాలు, తదితర అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఆ పార్టీ ఎంపిలు ఇక నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను ప్రారంభించిన కేంద్ర జాతీయరహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారుల విషయంలో అన్యాయం చేశారని టిఆర్‌ఎస్ ఎంపిలు ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందు గా ప్రతిపాదనలు పంపించినప్పటికీ అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఎపికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, పైగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి కేవలం ఒక సీటు మాత్రమే గెలువడంతో తెలంగాణపై కేంద్రం పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు లోక్‌సభ ఎన్నికలు, మరోవైపు ఇదే చివరి పార్లమెంట్ సమావేశాలు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టిఆర్‌ఎస్ వ్యూహారచరణ చేస్తోంది. జిఎస్‌టి, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతుగా ఇలా అనేక విషయాల్లో బిజెపికి అండగా నిలిచిందనే ఆరోపణలకు చెక్‌పెట్టాలంటే ఇదే సరైన సమయమని సిఎం కెసిఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఎపి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదని, పైగా నీతి అయోగ్ చేసిన పలు ప్రతిపాదనలను కూడా పట్టించుకోలేదని ఇలాంటి అనేక విషయాలపై ఫోకస్ చేయనున్నట్లు తెలిసింది. స్టీల్ ఫ్యాక్టరీ, బొగ్గుకర్మాగారం ఏర్పాటు వంటి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ ఎంపిలు ఆరోపిస్తున్నారు. పైగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయవంటి పథకాలను నీతి అయోగ్ ప్రశంసలు కురిపించినప్పటకీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయి ఆర్థిక సహాయం లేదని, కేంద్ర నిధుల విషయంలో కూడా పెద్దగా న్యాయం జరగడం లేదని టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రస్తావించాలని భావిస్తున్నారు.