ఇంటర్నెట్ లభ్యత ప్రాథమిక హక్కు
కశ్మీర్‌లో అన్ని ఆంక్షల ఉత్తర్వులను వారంలోగా సమీక్షించాలి
సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ లభ్యత అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతంలో విధించిన అన్ని ఆంక్షల ఉత్తర్వులను వారంలోగా జమ్మూకశ్మీర్ పాలకవర్గం సమీక్షించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) కింద ఇంటర్నెట్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యాపార నిర్వహణ, వృత్తుల నిర్వహణను చేసుకోవచ్చని మేము ప్రకటిస్తున్నాం అని న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం 130 పేజీల తీర్పును వెలువరించింది. సస్పెన్షన్ రూల్స్ కింద ఇంటర్నెట్‌ను రద్దు చేసే ఏ ఉత్తర్వునైనా జారీచేసే ముందు అవసరమైన కాలం కంటే ఎక్కువ విస్తరించకుండా దామాషా పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేక పబ్లిక్ సర్వీస్)రూల్స్ 2017 కింద ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా రద్దు చేయడం సరైన పద్ధతి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 370 అధికరణం రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎన్‌వి రమణ తీర్పు ప్రతులను చదివారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్జాలాన్ని ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది. కశ్మీర్ చాలా హింసను ఎదుర్కొంది. మానవ హక్కులు, భద్రతా సమస్యలను సమతుల్యం చేయడం మాపని. జమ్ముకశ్మీర్‌లో విధించిన అన్ని ఆంక్షలపై వారంలోగా సమీక్షించాలి. ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపివేయడానికి అనుమతించబోము. ఇంటర్నెట్ సేవలను పరిమితం చేయడం లేదా నిలిపివేయడం న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం. ఇటీవల కాలంలో భావ ప్రకటనకు అదొక సాధనంగా మారింది అని జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతర ఐచ్చికాలను అణచివేయడానికి సిఆర్‌పిసి 144 సెక్షన్‌ను నిరవధికంగా ఉపయోగించడం సరికాదని ముగ్గురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైన ఇంటర్నెట్, వైద్య, విద్యా సేవలను పునరుద్ధరించాలని కోర్టు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.