కేంద్ర సహాయ నిరాకరణపై ప్రత్యామ్నాయాలు
ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేలా చర్యలు
రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘ చర్చ
ప్రజాపక్షం/హైదరాబాద్: ఒక వైపు ఆర్థిక మాంద్యం, మరో వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభిచంకపోవడం పట్ల ప్రత్యామ్నాయ చర్యలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నిధులను కేంద్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబా ద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సాయంత్రం 5గంటలకు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సాయంత్రం సుమారు ఏడుగంటలకు ప్రారంభమైనట్టు తెలిసింది. సిఎం కెసిఆర్ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో సమావేశం ఆలస్యమైంది. ఈ సమావే శంలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, వివిధ సంక్షేమ పథకాలకు చెందిన నిధులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ చర్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. నిధుల సమీకరణలో భాగంగా భూముల విక్రయంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసర ఖర్చును తగ్గించుకోవాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిఎస్‌టి నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోగా రాష్ట్ర విభజన అంశాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని, జాతీయ రహదారుల నుంచి మొదలు రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇది వరకే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా ఒక నోట్‌ను మంత్రివర్గం ముందు పెట్టినట్టు తెలిసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల అంశాన్ని కూడా మంత్రివర్గం పునఃసమీక్షించారు. లోకాయుక్త చట్ట సవరణ, దుమ్ముగూడెం వద్ద కొత్త ఆనకట్ట నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించినట్టు సమాచారం.