తిరుపతి బహిరంగసభలో రాహుల్‌గాంధీ
ప్రజాపక్షం/ తిరుపతి: రైతులకు రుణాల మాఫీ చేయడానికి వెనుకాడుతున్న ప్రధాని నరేంద్రమోడీ అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తలకు ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చి, ఎలా క్షమించి వదిలిపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ భరోసాయాత్రలో భాగంగా శుక్రవారంనాడు తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ దేశానికి కాంగ్రెస్ ఏం చెప్పిందో, అదే అమలు చేసి చూపించిందని గుర్తుచేశారు. జాతీయ ఉపాధిహామీ పథకం, భూసేకరణ చట్టం కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రైతుల భూములను ఇష్టానుసారం తీసుకోవడానికి వీలు లేకుండా భూసేకరణ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ.70వేల కోట్ల రుణమాఫీ చేశామని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే 10 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పామని, కానీ కేవలం రెండ్రోజుల్లోనే అది అమలు చేసి చూపించామన్నారు. కానీ మన ప్రధాని మోడీ మాత్రం బడా వ్యాపారవేత్తలకు రూ.3.5లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, రైతులంటే ఆయనకు ఎందుకంత వ్యతిరేకతో తనకు అర్థం కావడం లేదన్నారు. మోడీ ఇచ్చిన హామీలన్నీ గల్లంతయ్యాయని రాహుల్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని.. ప్రతిపేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మోడీ ఇదే తిరుపతి వేదికగా హామీ ఇచ్చారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని కూడా తిరుపతిలోనే హామీ ఇచ్చారని రాహుల్ గుర్తుచేశారు. నాడు మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలైందా? అని ప్రజలను ప్రశ్నించారు. అవినీతి అంతానికి ప్రధానిగా కాకుండా కాపలాదారుగా కృషి చేస్తానని మోడీ అన్నారని, అదే ప్రధాని రాఫే ల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ ఇచ్చిన హామీలు, ప్రకటనలు అన్నీ అబద్ధాల పుట్ట అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తానని ఇదే వేదికపై ఐదేళ్లక్రితం చెప్పిన మోడీ చివరకు ఏం చేశారని, ఆఖరికి ఆయనకు ఆంధ్రావాళ్లంటేనే చిరాకు పుడుతోందన్నారు. కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యే క హోదా ఇవ్వకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి125 కోట్ల మంది మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఊమె న్ చాందీ, ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జేడీ శీలం,కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు.అంతకుముందు రాహుల్‌గాంధీ కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు.అలిపిరిలో ఉ.11:40గంటల సమయంలో నడక ప్రారంభించి కేవలం గంటా 50ని.వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు.మేనల్లుడు రేహాన్ వాద్రా తో నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొంది, గుడిలో దర్శనం చేసుకున్నారు.