ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు దేశాన్ని నాశనం చేశారని ఎఐసిసి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ఖర్గే శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి గాంధీ భవన్ చేరుకున్న ఖర్గే, ఇందిరా భవన్‌లో టిపిసిసి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలో మాకే జరుగుతున్న ఎన్నిక ఇది అన్నారు. ఈనెల 17న ఎఐసిసి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయన్నారు. తనకు ఓటేయాలని టిపిసిసి సభ్యులను కోరేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. 9 వేలకు పైగా ఓటర్లను నేరుగా కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ ఓటర్లను అభ్యర్థించానన్నారు. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరిగాయన్నారు. సుభాష్ చంద్రబోస్, కేసరి, సోనియాగాంధీ కోసం ఎన్నికలు జరిగాయని, ఇప్పుడు ఐదవసారి తాను పోటీలో నిలిచినట్లు వివరించారు. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తానని తెలిపారు. రైతులు, యువత, మహిళలు అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తానన్నారు. బిజెపి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నిక జరగలేదన్నారు. మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. పబ్లిక్ సెక్టార్‌లను మోడీ అమ్మెస్తున్నారని విమర్శించారు. కొందరిని మాత్రమే బిజెపి ఐశ్వర్యవంతులను చేస్తోందని మండిపడ్డారు. దీనివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగ శాతాన్ని తగ్గిస్తానని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. కొవిడ్ తర్యాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగం మరింత పెరిగిందన్నారు. మోడీ పాలనలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.82కు పడిపోయిందన్నారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయన్నారు. పాల నుంచి మొదలుకొని చిన్న పిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్లపైనా జిఎస్‌టి విధించారని ఆందోళన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధర రూ.1100 దాటిందన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా పార్టీలు ఉన్నాయన్నారు. అందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయని, వాటితో ఏమైందని, టిఎంసి ఎఐటిఎంసిగా మారిందన్నారు. ఎడిఎంకె ఎఐడిఎంకెగా మారినా బయట ఒక్క సీటు కూడా గెలవలేకపోయారన్నారు. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారినా అదే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, నాయకులు రమేష్ చెన్నితల, గౌరవ్ వల్లబ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.
మోడీ పాలనలో వ్యవస్థలన్నీ దుర్వినియోగం
RELATED ARTICLES