సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ
ప్రజాపక్షం / నిజామాబాద్ ప్రతినిధి: ప్రజల మధ్య ఐక్యతను చిన్నాభిన్నం చేసేందుకు కుల, మతాల మధ్య ఘర్షణలను ప్రేరేపిస్తూ కేంద్రంలోని బిజెపి సర్కార్ లౌకిక సంప్రదాయాలను మంటగలుపుతోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ ఆరోపించారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలు చేయటం వల్ల పేదరికం, ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ హిందు త్వ రాజ్య స్థాపనకు మెజార్టీగా ఉన్న హిందువులను ప్రలోభ పెడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ప్రజలను ఐక్యం చేసి లౌకిక సంప్రదాయం రక్షించడానికి వామపక్షాలు పోరాడుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి పశ్యపద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మతం పేరుతో ప్రజల్లో బిజెపి చీలికలు తీసుకువస్తూ రాజకీయ అఘాదాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రజలకు కనీస హక్కులు కూడా పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ మహాసభలో దేశ ప్రజల పక్షాన పోరాడేవిధంగా అన్ని రకాల జాతీయస్థాయి ప్రజా పోరాటానికి ప్రణాళిక సిద్ధమవుతాయని తెలిపారు. ఫాసిస్టు, మతోన్మాద శక్తులు పెరుగుతున్నాయన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటీకరణ చేస్తూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. దేశ ప్రజలకు వామపక్ష పార్టీలే అండగా ఉంటాయని తెలిపారు. జమీందారీ, జగిర్దారీ విధానాలకు వ్యతిరేకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, సామాజిక న్యాయం, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసిందని పశ్య పద్మ గుర్తుచేశారు. అదే పోరాట స్ఫూర్తితో మహాసభల ఉద్యమ సమీక్ష, భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకోవడం జరగుతుందని వెల్లడించారు. రౌండ్ టేండ్ సమావేశంలో సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకురాలు, మాజీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు జమున, జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాద్యక్షులు నర్రా రామారావు, ఎంబిటి నగర అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, అడ్వకేట్ ఆల్గోట్ రవీందర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింలు గౌడ్, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా నాయకులు వై.ఓమయ్య, ఏ.రాజేశ్వర్, ఎం.డి. రఫిక్ ఖాన్, రఘురాం, రంజిత్, భాను, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మోడీ పాలనలో… ప్రజల ఐక్యత చిన్నాభిన్నం
RELATED ARTICLES