నేరస్థులు మంత్రులైతే విచారణపై ప్రభావం
పంజరంలో పావురంలా ఎన్నికల కమిషన్
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : నాలుగున్నరేళ్ళ మోడీ పాలనలో దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని, నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు జిడిపికి సంబంధించి వాస్తవలు బయటికి రాకుండా చేశారని ఇపుడు జిడిపి చూస్తూ 5.5 శాతానికి పడిపోయిందన్నారు. మఖ్దూంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషాతో కలిసి ఆయన మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని సురవరం డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇందుకు కారణాలేమిటో చెప్పాలని వీటిని అధిగమించడానికి ఎలాంట చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. రిలయన్స్‌తో సహా అనేక కంపెనీలు ప్రభుత్వ ఖర్చుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో లాభాలు అర్జించాయని, కాని నిపుణత పెరగలేదని అన్నారు. మంత్రివర్గంలో నేరస్థులను చేర్చుకోవడం వల్ల వారిపై జరిగే విచారణ ఏ రకంగా నిస్పక్షపాతంగా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సోహ్రసబుద్దీన్ కేసుతో పాటు ఆరు క్రిమినల్ కేసులున్న అమిత్‌షా హోం మంత్రిగా ఎనిమిది క్యాబినెట్ సబ్‌కమిటీలలో సభ్యుడిగా ఉన్నారని, క్రిమినల్ కేసులున్న ప్రజ్ఞాసింగ్‌ను గెలిపించారని రేపు ఆమెను మంత్రివర్గంలో తీసుకున్నా అశ్చర్యంలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమయ్యిందని, గతంలోఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల కమిషన్ విమర్శలు ఎదుర్కొందన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇవిఎంలలో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చాయని అనేక చోట్ల 14 వేల వరకు ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్టాల్లోని అనేక నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటె ఎక్కువ ఓట్లు కౌంటింగ్‌లో వచ్చాయని బెగుసరాయి నియోజకవర్గంలోనే పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు బాగా తెడా ఉందని దీనిపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని లేని పక్షంలో కోర్టుకు వెళ్తామని సురవరం హెచ్చరించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు విచ్చిన్నం అయ్యాయని, ఎన్నికల కమిషన్ పంజరంలో పావురంలా మారిందని దుయ్యబట్టారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ బిజెపి భారీ మెజారిటీతో గెలిచిందని చెప్తున్నా ఆ పార్టీలకి 63 శాతం వ్యతిరేక ఓట్లు వచ్చిన విషయానిన గుర్తించాలన్నారు. ప్రధాని మోడీయే ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పశ్చిమబెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తోందన్నారు.
కెసిఆర్‌కు చంద్రబాబు గతే
ప్రజాతీర్పును ఏ విదంగా గౌరవిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ టిఆర్‌ఎస్ పూర్తి మెజారిటీతో గెలిచినా ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని గతంలో చంద్రబాబునాయుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారి గుణపాఠం చెప్పారని, కెసిఆర్‌కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. కెసిఆర్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలోనూ ప్రభుత్వమే విద్యార్థుల మరణానికి నైతిక బాధ్యత వహించాలన్నారు. మెంటల్ ఆసుపత్రినుంచి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారుల తీరు ఉందని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చప్రాసికి కూడా పనికి రాడని నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ ప ట్టణం ల్యాండ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ని యమించిన సిట్ విచారణ నివేదికను బయటికి తెచ్చి జ గన్ చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్: చాడ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం తప్పులపై తప్పులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు కాంగ్రెస్‌లో చేరారని వారి సభ్యత్వాలను రద్దు చేశారని, అదే కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్‌లో చేరితే వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరినా పట్టించుకోకుండా నేడు 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను టిఆర్‌ఎస్‌లో కలుపుకోవడం దారుణమన్నారు. తెలంగాణ రాజకీయాలను కెసిఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వంపై వత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్, ఇంటర్, ఫిర్యాయింపులు ఇలా అనేక అంశాలపై కోర్టు మందలించినా కెసిఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వ వైఖరినవలంలభిస్తోందని ఆరోపించారు.