న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాలుకదిపారంటే చాలా ఖర్చే. ఈ విషయం తాజా లెక్కల్లో తేలింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ ప్రయాణాల ఖర్చు ఏకంగా 2,021 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా వుంది కదూ! కానీ ఇది నిజంగానే నిజం. స్వయంగా విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో ఈ వ్యయలెక్కలను వెల్లడించారు. 2014 జూన్ నుంచి మోడీ విదేశీ ప్రయాణాల కోసం ఛార్టర్డ్ ఫ్లయిట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ, పర్యటన సందర్భంగా హాట్‌లైన్ సదుపాయాలు వంటివి ఈ ఖర్చులకు కిందకు వస్తాయని మంత్రి తెలిపారు. మోడీ అలా నిరంతరాయంగా విదేశీ పర్యటనలు చేసిన కారణంగా మనకు రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) విపరీతంగా, వెల్లువలా వచ్చిపడ్డాయని చెప్పుకొచ్చారు. మోడీ 2014 నుంచి 2018 వరకు తిరిగిన దేశాల్లో అగ్రశ్రేణిలో వున్న 10 దేశాలు వున్నాయని తెలిపారు. 2014లో 30,930.5 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి రాగా, 2017లో ఏకంగా 43,478.27 మిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు తరలివచ్చాయన్నారు. మంత్రి సమర్పించిన వివరాల ప్రకారం, యుపిఎ 2 ప్రభుత్వ కాలంలో 2009-10 నుంచి 2013-14 వరకు ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విదేశీ ప్రయాణాల కోసం 1,346 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మన్మోహన్, మోడీలు తమ పదవీకాలంలో చేసిన విదేశీ ఖర్చులపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి వి.కె.సింగ్ సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. 2014 జూన్ 15 నుంచి 2018 డిసెంబరు 3 వరకు ప్రధాని మోడీ తన ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ కోసం రూ. 1,583.18 కోట్లు, ఛార్టర్డ్ ఫ్లయిట్స్‌పై రూ. 429.25 కోట్లు, అలాగే హాట్‌లైన్‌పై రూ. 9.11 కోట్లు వ్యయమైనట్లు తెలిపారు. 2014 మేలో మోడీ ప్రధాని అయ్యాక ఇప్పటివరకు 48 విదేశీ పర్యటనలు జరిపారు. అందులో 55కు పైగా దేశాలను సందర్శించారు. ఛార్టర్డ్ ఫ్లయిట్స్ కోసం 2014-15లో రూ. 93.76 కోట్లు, 2015016లో రూ. 117.89 కోట్లు, 2016-17లో రూ. 76.27 కోట్లు, 2017-18లో రూ. 99.32 కోట్లు ఖర్చయింది. 2018-19 డిసెంబరు 3 వరకు రూ. 42.01 కోట్లు వ్యయమైంది.
మోడీ కాలు కదిపితే ఖర్చే!
RELATED ARTICLES