ప్రజాపక్షం/న్యూఢిల్లీ : వలస కార్మికులు, పేదల సాధకబాధకాలను పరిష్కరించే చర్యలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. న్యూఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు వివిధ రూపాల్లో తమ అసమ్మతి వ్యక్తం చేశారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వంలో న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం అజయ్‌భవన్ వద్ద కార్యకర్తలు ప్లకార్డులు ధరించి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, ఆ తర్వాత దశలవారీగా ఆర్థికమంత్రి చెప్పిన ప్యాకేజీ వివరాలన్నీ వట్టి బూటకమని, ఆకలిలతో అలమటిస్తున్న వలస కార్మికులు, నిరుపేదలను ఈ ప్యాకేజీలు ఏ మాత్రం ఆదుకోలేకపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. గడిచిన ఆరేళ్లుగా మోడీ సర్కారు విపత్కర, నయా ఉదారవాద విధానాల ఫలితమే నేటి ఆర్థిక వ్యవస్థ దుస్థితి అని విమర్శించారు. దీనికి కొవిడ్ 19 తోడై సంక్షోభాన్ని మరింత పెంచిందన్నారు. రాష్ట్రాలకు తగినన్ని నిధులు, ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని, వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు మరిన్ని రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రయాణ భత్యం కింద వారికి ఒక్కొక్కరికీ రూ. 10,000 చొప్పున అందించాల ని, ఉపాధి హామీపథకాన్ని నిర్వీర్యం చేయరాదని, నరేగా కింద పనిదినాలను పెంచాలని, పట్టణ ఉపాధి హామీ, ఆవాసం కల్పించాలని, రేషన్, పెన్షన్‌లకు షరతులు విధించవద్దని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితరులకు పెన్షన్లను పెంచాలని, సామాజిక భద్రత చర్యలను చేపట్టాలని, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయరాదని, గ్రామీణ, చిన్న, సన్నకారు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇవే నినాదాలతో ప్లకార్డులు ధరించారు.
మోడీ ఆర్థిక ప్యాకేజీ బూటకం
RELATED ARTICLES